మంచిర్యాల అగ్రికల్చర్ : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడిజిల్లా అగ్నిగుండలా తలపిస్తుంది. ఆదివారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధికం. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరకుంటుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 35 డిగ్రీలకు చేరుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా వేడిగాలుల ప్రభావం చూపుతోంది. మూడు రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతుండడంతో జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు. గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బదాటికి మార్చి నుంచి ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు ఒకరిద్దరు చొప్పున వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గుబావులు, ఓపెన్‌కాస్టులు ఉన్న ప్రాంతాల్లో ఆదివారం మధ్నాహ్నం ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఓపెన్ కాస్టుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు అల్లాడిపోయారు. అడవులు అంతరిస్తుండటం, జలాశయాలు అడుగంటడం.. తదితర కారణాల వల్ల ఎండ తీవ్రత ఏటేటా పెరుగుతోంది. సాయత్రం 6 గంటలు దాటితే కాని జనాలు బయటికి రాని పరిస్థితి. వాహన చోదకులు ముఖానికి రక్షణ లేకుండా బయటకు రావడం లేదు. అడవుల జిల్లాగా పెరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాగులు, బోరు బావులుల్లో నీరు అడుగంటుతున్నాయి. గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి తలెత్తుతోంది. మే నెలలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
భానుడు.. బ్యాండ్ బాజా
ఇదే నెలలో అత్యధికంగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఇటు ఎండలతో ఇళ్లలో ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లేవారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రయాణాలు చేసేటప్పుడు...
►శరీరాన్ని పట్టుకునేలా ఉండే దుస్తులను కాకుండా కొద్దిగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు.
►సాధ్యమైనంత మేరకు ఉదయం చల్లగా ఉన్న సమయంలోనే వివాహాలకు బయలుదేరాలి. అక్కడ బంధువులతో కాలక్షేపం చేస్తూ సాయంత్రం వరకు ఉంటే మేలు.
► ముఖ్యంగా వ్యాన్, లారీల్లో వెళ్లాల్సి వస్తే.. వాటిపై తాటిపత్రిలాంటివి వేసుకోవాలి. ఇరుకుగా కాకుండా తక్కువ మోతాదులో మందిని తరలించేలా ఏర్పాటు చేసుకోవాలి.
►తప్పనిసరిగా తగినంత మేర చల్లని నీటిని తీసుకెళ్లాలి.
►వాహనాలపై వెళ్లాల్సి వస్తే తల, ముక్కు, చెవులకు నిండుగా ఉండేలా కాటన్ టవల్, కర్చీఫ్ కానీ కట్టుకోవాలి. కళ్లకు చల్లని చలువ అద్దాలు పెట్టుకోవాలి. గోడుగు, టోపి వెంట తీసుకెళ్తే మేలు.
►నీళ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. ఎండకు తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లని నీరు ఒకేసారి తీసుకోకూడదు.
►త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
► తక్కువ మోతాదులో ఎక్కువసార్లు నీటిని తాగాలి.
►నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తాగాలి.
►సోడియం, పొటాషియం ఉన్న ద్రవపదార్థాలు తీసుకోవాలి.
►వడదెబ్బకు గురైన వారిని చల్లని లేదా నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి.
►నుదుటిపై తడిగుడ్డ వేసి తడుస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి.
►బీపీ లేదా పల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
►గాలి ఎక్కువగా తగిలేలా చూడాలి.
►నీరు ఎక్కువగా తాగించాలి.
►అవసరాన్ని బట్టి వైద్యుడికి చూపించి ప్రాథమిక చికిత్స అందించాలి.
వారంరోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
తేదీ కనిష్టం గరిష్టం
22 27.6 40.8
23 27.5 39.8
24 27.4 42.3
25 26.8 43.3
26 29.8 44.3
27 32.4 44.8
28 32.5 45.3
జిల్లాలో ఐదేళ్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు, ప్రాంతాలు
సంవత్సరం ప్రాంతం ఉష్ణోగ్రత
26–04–2014 దండేపల్లి 46.3
29–04–2015 దండేపల్లి 45.6
26–04–2016 దండేపల్లి 48.8
21–04–2017 జన్నారం 45.0
21–04–2018 దండేపల్లి 44.3
27–04–2019 దండేపల్లి 45.3
భానుడి భగభగ
Published Tue, Apr 30 2019 8:44 AM | Last Updated on Tue, Apr 30 2019 8:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment