- తెలంగాణలోనే ఖమ్మం మార్కెట్‌లో గరిష్టంగా రూ.5400కు కొనుగోలు
- పంట ఉత్పత్తి తగిన స్థాయిలో లేకపోవటంతోనే పెరిగిన ధర
- మద్దతు కన్నా రూ.1400 అధికం
ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వేరుశనగకాయ ధర రికార్డు స్థాయిలో పలికింది. క్వింటాలు వేరుశనగ ధర రూ.5400కు కొనుగోలు చేశారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఈ ధర అధికం. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో గత సోమవారం రూ.5,225 పలికింది. దానినే గరిష్ట ధరగా అనుకున్నారు. ఆ ధరకు మించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ రేటు పలికింది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కేసముద్రం, జనగామ, సూర్యాపేట, తిరుమలగిరి, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లలో వేరుశనగకాయను కొనుగోలు చేస్తారు. రబీలో వేరుశనగ కాయను విస్తారంగా పండిస్తారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట సాగు బాగా తగ్గటంతో డిమాండ్ ఏర్పడుతోంది.
సాగుతగ్గటం.. ధర పెరగటం..
జిల్లాలో రబీ వేరుశనగ సాధారణ విస్తీర్ణం 5,873 హెక్టార్లు కాగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 4,019 హెక్టార్లలో పంటను సాగు చేశారు. సాధారణం కన్నా సాగు విస్తీర్ణం తగ్గటం, పంట దిగుబడులు కూడా ఆశించిన మేరకు లేకపోవటంతో వేరుశనగకు డిమాండ్ పెరిగింది. వేరుశనగ కాయకు ఈ ఏడాది ప్రభుత్వం క్వింటాలుకు రూ.4,000 మద్దతు ధరగా ప్రకటించింది. దాదాపు నెల రోజులుగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు వ్యాపారులు సరుకును కొనుగోలు చేస్తున్నారు. 10 రోజులుగా క్వింటాలుకు గరిష్టంగా రూ.5000 నుంచి రూ.5,200 వరకు కొనుగోలు చేస్తున్నారు.
జిల్లాలోని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ బుధవారం 10 బస్తాల వేరుశనగ కాయను అమ్మకానికి తెచ్చారు. కాయ నాణ్యంగా ఉండటంతో ఆ సరుకుకు తాటికొండ ఉపేందర్ అనే వ్యాపారి రూ.5400 ధర పెట్టాడు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కన్నా అదనంగా రూ.1400 ధర పలికింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వేరుశనగ సాగుకు పెట్టింది పేరు. అక్కడ మార్కెట్‌లో ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది అక్కడ కూడా పంట ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవటంతో సరుకుకు డిమాండ్ పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పండిన పంట ఇప్పటికే చెన్నై ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఈ కారణంగానే వేరుశనగకు డిమాండ్ పెరుగుతందని వేరుశనగ వ్యాపారి నున్నా సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం మార్కెట్‌లో రైతు సరుకు కొనుగోలు చేయటం ఆనందంగా ఉందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎస్.వినోద్‌కుమార్, గ్రేడ్-2 కార్యదర్శి ఖాదర్‌బాబు, సూపర్‌వైజర్ డి.నిర్మల తెలిపారు.