
ఉవ్వెత్తున ‘జిల్లా’ ఉద్యమం
జనగామలో హైటెన్షన్
మూడు గంటల పాటు నేషనల్ హైవేలు దిగ్బంధం
పది కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
టైర్లకు నిప్పంటించిన ఉద్యమకారులు
డప్పు చప్పుళ్లతో న్యాయవాదుల నిరసన
పోలీసులకు, ఉద్యమకారుల మధ్య వాగ్వాదం, తోపులాట
జనగామ : జిల్లా సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమంతో జనగామలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సకల జనులు రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. జనగామను జిల్లా సాధించుకోవాలనే పట్టుదలతో సోమవారం జేఏసీ తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం ఉద్రిక్తంగా మారింది. మూడు గంటల పాటు హైదరాబాద్-హన్మకొండ, సిద్ధిపేట-సూర్యపేట హైవేలను ఎక్కడికక్కడ మూసి వేయడంతో పెంబర్తి, యశ్వంతాపూర్, శామీర్‌పేట, నెల్లుట్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా దిగ్బంధించారు. లారీ ఓనర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన హైవేపై 20 లారీలను అడ్డంగా నిలిపివేయడంతో ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో సీఐలు చెన్నూరి శ్రీనివాస్, కరుణాసాగర్‌రెడ్డి, సబ్ డివిజన్ పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మూడు రహదారుల చౌరస్తా కావడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని లాక్కెళ్లే ప్రయత్నంలో సకల జనులు మద్దతుగా వెళ్లడంతో పరిస్థితులు చేరుుదాటిపోయే అవకాశం ఏర్పడింది. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు జక్కుల వేణుమాధవ్, జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళ్లపల్లి రాజు, టీజీవీపీ ప్రతినిధి పిట్టల సురేష్, మాజీద్ ప్రతిఘటించడంతో పోలీసులు వారిని బలవంతంగా లాక్కెల్లే ప్రయత్నం చేశారు.
జేఏసీ నాయకులతో పాటు విద్యార్థి సంఘాలు అడ్డుపడడంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. జనగామ జిల్లా చేస్తున్నట్లు ప్రకటన వచ్చే వరకు లాఠీ దెబ్బలు, కేసులకు భయపడేది లేద ంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హన్మకొండ రహదారిలో వాహనాలు వెళ్లకుండా టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. మూడు గంటల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆర్టీసీ బస్సులు, కార్లలో వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంటకు డీఎస్పీ జేఏసీ నాయకులతో చర్చలు జరుపగా, రాస్తారోకోను విరమింపజేశారు. ఆందోళనలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఆకుల సతీష్, కేమిడి చంద్రశేఖర్, పజ్జూరి గోపయ్య, మహంకాళి హరిచంద్రగుప్త, సాధిక్‌అలీ, కృష్ణ, ధర్మపురి శ్రీనివాస్, మాశెట్టి వెంకన్న, జేరిపోతు కుమార్, సౌడ రమేష్, పిట్టల సత్యం ఉన్నారు.