మట్టి దిబ్బలో మహా చరిత్ర | historical evidence behind the mound | Sakshi
Sakshi News home page

మట్టి దిబ్బలో మహా చరిత్ర

Published Fri, Jan 20 2017 1:35 AM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

మట్టి దిబ్బలో మహా చరిత్ర - Sakshi

మట్టి దిబ్బలో మహా చరిత్ర

మట్టి దిబ్బ మాటున శాతవాహనుల చరిత్ర
వందేళ్ల కిందే చారిత్రక ప్రాధాన్యత


సాక్షి, సంగారెడ్డి: శాతవాహనుల కాలం నాటి చారిత్రక ప్రదేశాన్ని గుర్తించి వందేళ్లు కావస్తు న్నా.. పూర్తి స్థాయిలో వివరాలు వెలుగు చూడటం లేదు. సుమారు వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న మట్టి దిబ్బల వెనుక విలువైన చారిత్రక ఆధారాలు దాగి ఉన్నట్టు పురావస్తు శాఖ చెబుతోంది. భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్‌ఐ) ఆధ్వర్యంలో జరిగిన తవ్వ కాల్లో సూక్ష్మ, మధ్య శిలాయుగం సంస్కృతి బయట పడింది. ఇక్కడ తవ్వకాల్లో వెలుగు చూసిన వస్తువులతో ఏఎస్‌ఐ తెలంగాణలోనే ఏకైక మ్యూజియంను నిర్వహిస్తోంది. అయితే ఇప్ప టి వరకు అరకొరగానే తవ్వకాలు జరగడంతో పూర్తి చరిత్ర వెలుగు చూడటం లేదు.సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండల కేంద్రంలో సుమారు వంద ఎకరాల్లో విస్తరిం చి ఉన్న ఓ మట్టి దిబ్బను విదేశీ పురాతత్వ నిపుణుడు హెన్నీ కౌజెన్స్‌ 1907లో గుర్తించా డు. ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన నాటి హైదరాబాద్‌ ప్రభుత్వం 1940–42లో పురాతత్వ శాఖ ద్వారా తవ్వకాలు జరిపించింది.

ఖ్వాజా మహ్మద్‌ అనే పురాతత్వ నిపుణుడి పర్యవేక్షణలో జరిగిన తవ్వకాల్లో అనేక చారిత్రక ఆధారాలు వెలుగు చూశాయి. మట్టి దిబ్బను ఆనుకుని ప్రవహించే వాగు సమీపంలో మధ్య శిలాయుగం నాటి పనిముట్లు, పనిముట్ల తయారీ పరిశ్రమ, సూక్ష్మ శిలాయుగం నాటి కోణాకృతులు తదితరాలు బయట పడ్డాయి. దీంతో ఈ ప్రాంతం సూక్ష్మ, మధ్య శిలా యుగం నాటి సంస్కృతి ఉనికిని పురాతత్వ నిపుణులు గుర్తించారు. ఆ తర్వాత 1970–71 లో ఏఎస్‌ఐ (ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) ఆధ్వర్యంలో మరోమారు తవ్వకా లు సాగించారు. నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డళ్లు, గచ్చకావి, ఎరుపు రంగు మట్టి పాత్రలు బయట పడ్డాయి. కాల్చిన ఇటుక, సున్నంతో నిర్మించిన శిథిల నిర్మాణాలు, శిల్ప ఖండాలు, నాణేలు, పూసలు, మట్టి బొమ్మలు, వివిధ ఆకృతుల్లో ఉన్న మట్టి పాత్రలు బయట పడ్డాయి. తిరిగి 2009–11 మధ్యకాలంలోనూ ఏఎస్‌ఐ జరిపిన తవ్వకాల్లోనూ శాతవాహనుల కాలం నాటి చారిత్రక ఆధారాలు, బౌద్ధస్తూప, విహార, చైత్య మండపాల ఆనవాళ్లు, నేల మాళిగ అవశేషాలు బయట పడ్డాయి. వంద ఎకరాల్లో విస్తరించిన ఈ మట్టి దిబ్బపై వందేళ్ల కాలంలో కేవలం పదోవంతు కూడా తవ్వకాలు జరగకపోవడంతో పూర్తి స్థాయిలో చరిత్ర వెలుగు చూడటం లేదు.

తవ్వకాల్లో శాతవాహనుల ఆనవాళ్లు
ఇప్పటివరకు పలు దఫాలుగా జరిపిన తవ్వకాల్లో వెలుగు చూసిన చారిత్రక ఆనవాళ్లు శాతవాహనుల కాలం నాటి జీవన విధానానికి అద్దం పట్టేలా ఉన్నాయి. తవ్వకాల్లో బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలు, చైత్యాల ఆనవాళ్లు బయట పడ్డా.. నిధుల కొరతతో పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగలేదు. వర్షానికి మట్టి కొట్టుకు పోతుండటంతో మట్టి పాత్రలు, ముడి ఇనుప వస్తువులు, కాల్చిన ఇటుకలు ఎటు చూసినా బయట పడుతున్నా యి. అమరావతి, నాగార్జున కొండ, ఫణిగిరి తరహాలో ఇక్కడా బౌద్ధమ తానికి సంబంధిం చిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసే అవకాశ ముందని చరిత్రపై ఆసక్తి ఉన్న వారు వ్యాఖ్యా నిస్తున్నారు. నిధుల కొరతతో తరచూ తవ్వకాలు నిలిచిపోతుండగా.. చారిత్రక మట్టిదిబ్బ చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు ఉండ టంతో క్రమ క్షయానికి గురవుతోంది. ఆర్కి యలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు వేగంగా జరపాలని కోరుతున్నారు.

ప్రచారానికి నోచుకోని మ్యూజియం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏఎస్‌ఐ ఆధ్వర్యంలో  చంద్రగిరి, నాగార్జునకొండ, అమరావతి, కొండాపూర్‌లలో నాలుగు మ్యూజియాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలం గాణలో కొండాపూర్‌ మ్యూజియం మాత్రమే ఉంది. చారిత్రక సంపద కొలువైన ఈ మ్యూజియంలో వివిధ కాలాలకు అద్దం పట్టే మట్టి పాత్రలు, మట్టి బొమ్మలు, నాటి ప్రజలు ధరించిన ఆభరణాలు, తాయెత్తులు, గవ్వ, రాగి, గాజుతో తయారు చేసిన కంకణాలు, కాల్చిన మట్టితో చేసిన పూసలు భద్రపరి చారు. శాతవాహనుల కాలం నాటి ముద్రిత నాణేలు, రాగి, సీసం నాణేలు ఉన్నాయి. రమోన్‌ చక్రవర్తి పోన్‌టిఫ్‌ ఆగస్టస్‌ (క్రీ.పూ 37 నుంచి క్రీ.శ. 14 వరకు) రూపం కలిగిన నాణేలు కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు.

గుణాఢ్యుడి రాజధాని కొండాపూర్‌..
శాతవాహనుల కాలంలో చుట్టూ కోటతో ఆవరించిన మహానగరంగా కొండాపూర్‌ను చరిత్రకారులు అభివర్ణిస్తున్నారు. బృహత్క థను రచించిన శాతవాహన రాజు గుణాఢ్యుడు కొండాపూర్‌ రాజధానిగా పరిపాలించినట్టు తెలుస్తోంది. క్రీ.పూ. రెండో శతాబ్దంలో కొండాపూర్‌ మహా నగరంగా విరాజిల్లగా, శాతవాహనుల ‘టంకశాల’ ఇక్కడే ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. దక్షిణ తక్షశిలగా పిలిచే కొండాపూర్‌ను శాతవాహనులు పాలించి నట్టు తవ్వకాల్లో సాక్ష్యాధారాలు లభిం చాయి. ఆధునిక నగర జీవితానికి అవస రమైన అన్ని సదుపాయాలు ఆనాటికే ఉన్నట్టు కొండాపూర్‌ తవ్వకాల్లో ఆధారాలు లభించాయి. శాతవాహనుల కాలంనాటి ప్రజలు నివసించిన గృహ సముదాయాలు, రాగి నాణేలు, దంతపు వస్తువులు, గాజు, మట్టి పాత్రలు ఇక్కడ బయట పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement