‘హైటెక్‌’కు వాయిదా! | Hitech City lane Metro Train Works Delayed | Sakshi
Sakshi News home page

‘హైటెక్‌’కు వాయిదా!

Published Tue, Dec 18 2018 9:36 AM | Last Updated on Tue, Dec 18 2018 9:36 AM

Hitech City lane Metro Train Works Delayed - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైటెక్‌ సిటీ వరకు మెట్రోరైలు నూతన సంవత్సరంలోనే పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ మార్గంలో ఎస్‌ఆర్‌డీపీ పనుల కారణంగా రైళ్లు ఒక చివరి నుంచి మరో చివరకి వెళ్లి వెనక్కి వచ్చేందుకు రివర్సల్‌ ట్రాక్‌  సదుపాయం లేదు. దీంతో మెట్రో రైలు ఒక గమ్యం నుంచి మరో గమ్యస్థానానికి ఒకే ట్రాక్‌లో వెళ్లి తిరిగి అక్కడి నుంచి వచ్చేందుకు ట్విన్‌ సింగిల్‌ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే ఈ రూట్లో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలు ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ, మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ మార్గానికి సంబంధించి రైలు వేగం, బ్రేకులు, కమ్యూనికేషన్‌బేస్డ్‌ ట్రెయిన్‌ కంట్రోల్‌వ్యవస్థ, ట్రాక్, సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్‌ తదితర 18 రకాల భద్రతా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని పరీక్షల్లోనూ మెట్రో రైళ్లు విజయం సాధించినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ మార్గంలోని 8 స్టేషన్ల వద్ద కూడా మిగిలిన పనులను వడివడిగా పూర్తిచేస్తామని పేర్కొన్నాయి.

ఈ రూట్లో మెట్రో స్టేషన్ల పరిస్థితి ఇదీ..
అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ రూట్లో మొత్తం 8 స్టేషన్లున్నాయి. ఇందులో మధురానగర్‌ స్టేషన్‌ వద్ద పనులు పూర్తిచేసి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇక యూసుఫ్‌గూడా స్టేషన్‌ వద్ద సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.  జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం.5 స్టేషన్‌ వద్ద ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. పెద్దమ్మగుడి స్టేషన్‌ వద్ద పనులు తుది అంకానికి చేరుకున్నాయి. మాదాపూర్‌ స్టేషన్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దుర్గం చెరువు స్టేషన్‌కు మెట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇక హైటెక్‌సిటీ స్టేషన్‌ పనులతోపాటు సుందరీకరణ పనులు పూర్తిచేయడంతో ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

నిత్యం రెండు లక్షలమంది మెట్రో జర్నీ..
ప్రస్తుతం ఎల్బీనగర్‌–మియాపూర్‌(29 కి.మీ)మార్గంలో నిత్యం సుమారు 1.50 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవుదినాల్లో రద్దీ 1.95 లక్షల వరకు ఉంది. ఇక నాగోల్‌–అమీర్‌పేట్‌(17 కి.మీ)మార్గంలో నిత్యం సుమారు 50 వేల మంది ప్రయాణిస్తుండగా..సెలవురోజుల్లో రద్దీ 80 వేల వరకు ఉంటుంది. అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్లు జనవరిలో అందుబాటులోకి వస్తే నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య మూడులక్షల మార్కును దాటే అవకాశాలున్నట్లు మెట్రో రైలు వర్గాలు అంచనావేస్తున్నాయి. జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గం వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు.ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో జనవరిలో పనులు మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరిలోగా మెట్రో మార్గాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement