హోలీడే...జాలీడే..!
హోలీ..రంగుల వాన. కోప,తాపాలను కాసేపు గట్టుమీద పెట్టి అంతా చిందులేసుకుంటూ చేసుకునే ‘వర్ణ’ సంబరం. కాముని పున్నమి సందర్భంగా జిల్లా అంతటా ఆనందం చిందింది. పట్టణ రోడ్లు మొదలుకొని...పల్లె లోగిళ్ల వరకూ పరస్పరం అభినందనలు చెప్పుకుంటూ..వయో బేధం లేకుండా ఆడారు. పెద్దలు చిన్నపిల్లలై గంతులేస్తే..చిన్నారులు అవధుల్లేని...సందడి చేశారు. డప్పులు మోగించి..నాట్యం చేశారు. కేరింతలతో..కొత్త అందం తెచ్చారు.
తీన్‌మార్ దరువు, ఉత్సాహ పరిచే పాటలకు చిన్నాపెద్ద స్టెప్పులే శారు. కేరింతలు కొడుతూ.. ఈలలు వేస్తూ హోలీరోజు చిందులేశారు. ఉత్సాహంగా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్నికలు సమయం కావడంతో వివిధ పార్టీల నాయకులు వేడుకల్లో ప్రేత్యేక ఆకర్షణగా కనిపించారు. రంగునీళ్లతో రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. జిల్లాస్థాయి అధికారులు, మహిళలు రోడ్లమీదకు వచ్చి సంబరాలు జరుపుకున్నారు.