మహబూబ్‌నగర్: సాధారణ దుస్తుల్లో వెళ్తున్న పోలీసులపై రంగులు చల్లిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు గ్రామంలో జరిగింది. గట్టులోని యువకులు హోళీ సంబరాలు చేసుకుంటుండగా ఐడీ పార్టీకి చెందిన ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ సాధారణ దుస్తుల్లో ద్విచక్ర వాహనంపై అటువైపు వచ్చారు. వారు పోలీసులని తెలియక కొందరు యువకులు వారిపై రంగులు చల్లారు. దీంతో ఆగ్రహానికి గురైన ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ అక్కడున్న వడ్డే భీమేష్ అనే యువకునిపై చేయి చేసుకున్నారు.
అంతటితో ఆగకుండా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాది, నిర్బంధించారు. దీంతో స్థానికులు బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం వారంతా పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా అదుపులోకి తీసుకున్న యువకున్ని పోలీసులు వదిలి వేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.