
లక్డీకాపూల్ (హైదరాబాద్): లాక్‌డౌన్ నేపథ్యంలో మార్కెట్‌కి వెళ్లి కోరిన పండ్లు కొనుక్కోలేని వారికి వాటిని ఇంటివద్దకే అందించే సదుపాయాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇంటివద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియకు వినియోగదారుల నుంచి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. జంటనగరాల్లో కాలనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు 30 ప్యాక్‌లు చొప్పున 7330733212 కాల్ సెంటర్‌కు ఫోన్‌లో ఆర్డర్ చేస్తే చాలు..కోరిన పండ్లు నేరుగా అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ తరహా సరఫరాలో పండ్ల ధరలు ఇలా ఉన్నాయి..రూ.300కు మామిడి పండ్లు..1.5 కిలోలు, బొప్పాయి 3 కిలోలు, సపోట 1 కిలో, బత్తాయి 2.5 కిలోలు, డజన్ నిమ్మకాయల ప్యాక్, కలంగిరి 4 కిలోలు చొప్పున సరఫరా చేస్తున్నారు. ఉద్యాన పంటల రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మొబైల్ రైతు బజార్ల ద్వారా రోజుకు 550 కేంద్రాలలో ప్రజల వద్దకు పండ్లు, కూరగాయలను సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రవి కుమార్, జేడీ శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఇంటి వద్దకే పండ్ల సరఫరా ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వారానికి నగరంలోని 3,500పై చిలుకు ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతుల నుంచి కొనుగోలు చేసిన పండ్లను సేకరిస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment