హోంమంత్రి నాయిని సుడిగాలి పర్యటన
కరీంనగర్ : హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నాయిని నర్సింహారెడ్డి ఆదివారం తొలిసారి జిల్లాకు వచ్చి సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాకేంద్రంతోపాటు పెద్దపల్లి, గోదావరిఖనిల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రికి కరీంనగర్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్ తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీ సుల గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే లు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మంత్రి నాయినికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు కట్టారు. పెద్దపల్లి, గోదావరిఖనిల్లో అభినందన సభల్లో పాల్గొనేం దుకు వెళ్తున్న క్రమంలో దారిపొడవునా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలో భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలకగా అక్కడ మంత్రి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పెద్దపల్లిలోని అమర్‌చంద్ కల్యాణమంటపంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరసన్మాన కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. రామగుం డంలో ఐటీఐ కళాశాల పక్కాభవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో మంత్రిని సన్మానించారు.
అక్కడ సింగరేణి, కేశోరాం తదితర కార్మిక సంఘాల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఎన్టీపీసీ మేడిపెల్లి సెంటర్‌లో పార్టీ జెండా ఎగురవేశారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలో తెలంగాణ సామాజిక సాంస్కృతిక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.