హోమియో డాక్టర్.. అల్లోపతి వైద్యం..!
♦ కన్సల్టెంట్ డాక్టర్ల పేరిట శస్త్రచికిత్సలు చేస్తున్న వైనం
♦ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో బయటపడ్డ మరో మోసం
హుస్నాబాద్: అర్హత లేకున్నా, అవసరం లేకున్నా కాసుల కోసం ఆపరేషన్లు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ దందా కరీంనగర్ జిల్లాలో బయటపడింది. హుస్నాబాద్ బస్టాండ్ వెనకాల లత (వజ్ర) బీఏఎంఎస్(యూహెచ్‌ఎస్) అర్హతతో సాయి నర్సింగ్ హోమ్‌లో స్త్రీల వైద్య నిపుణురాలిగా చెలామణి అవుతోంది. ప్రసవాలు, గర్భసంచి తొలగింపు తదితర ఆపరేషన్లు సైతం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఆస్పత్రిపై దాడులు నిర్వహించారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని తలదన్నేరీతిలో ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఇద్దరు మహిళలు సిజేరియన్, మరో మహిళ గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకుని బెడ్‌పై కనిపించారు. ఆపరేషన్ ఎవరు చేశారని పేషెంట్లను పోలీసులు ప్రశ్నించగా, లత డాక్టర్ చేసినట్లు స్పష్టం చేశారు. లతను పోలీసులు ప్రశ్నించగా... ‘వరంగల్, కరీంనగర్‌లలో కార్పొరేట్ ఆస్పత్రుల కంటే మేం అతి చౌకగా ఆపరేషన్ చేస్తాం. అక్కడైతే కనీసం రూ.50 వేలు తీసుకుంటారు. మేం మాత్రం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటం.
వరంగల్ నుంచి నిపుణులను తీసుకొచ్చి ఆపరేషన్లు చేరుుస్తం’ అంటూ సమాధానం చెప్పింది. లత చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు సదరు వైద్య నిపుణులకు ఫోన్ చేసి ప్రశ్నించగా, తాము వారం రోజుల నుంచి ఎలాంటి ఆపరేషన్ చేయలేదని పేర్కొన్నారు. దీంతో ఈ ఆపరేషన్లు లత చేసినట్లు నిర్ధారణకు వచ్చిన ఆమెపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఆస్పత్రి నిర్వాహకుడు.. వైద్యురాలు లత భర్త చంద్రశేఖర్‌పైనా కేసు నమోదు చేశారు. ఆపరేషన్ థియేటర్‌ను, ల్యాబ్ ను సీజ్ చేశారు. కాగా, అడ్డగోలు ఆపరేషన్ల వ్యవహారంలో కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన అయ్యప్ప ఆస్పత్రి సర్జన్ మనోజ్‌కుమార్, మరో ఆర్‌ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.