సమస్యకు పరిష్కారం ఉందా?
నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఈమధ్య రాత్రివేళల్లో నిద్రపట్టడం లేదు. చెమటలు పట్టడం, ఆందోళన, ప్రతి చిన్న విషయానికి ఆతృత పడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈమధ్యనే అధిక ఒత్తిడిని తట్టుకోలేక నా ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాను. దయచేసి నా ఒత్తిడి తగ్గడానికి హోమియోలో ఏదైనా పరిష్కారం చెప్పండి? – రవి, హైదరాబాద్
ఈ ఆధునిక యుగంలో శారీరక శ్రమ తగ్గి, ఒత్తిడి (స్ట్రెస్) పెరిగింది. శారీరక, మానసిక పరిస్థితిని బట్టి స్ట్రెస్ తీవ్రత, స్ట్రెస్ కలిగించిన ఆయా సందర్భాలు, సమయాలను బట్టి ఒక్కో వ్యక్తిలో వ్యక్తమయ్యే లక్షణాలు ఒక్కోలా ఉంటాయి. ఆకస్మిక అధిక స్ట్రెస్ లేదా దీర్ఘకాలిక స్ట్రెస్ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. మానవ మెదడులో 10 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ప్రతి కణం... మిగతా కణాలతో అనుసంధానితమై ఉంటుంది. ఒక కణం నుంచి మరో కణానికి సందేశాలు అందుతూ ఉంటాయి. మన ఆవేశ, కావేశాల్లాంటి అనుభూతులను న్యూరోట్రాన్స్‌మిటర్స్ అదుపు చేస్తాయి. మెదడులోని ఆవేశ కేంద్రంలో ఐదురకాల న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఉంటాయి. అధిక ఒత్తిడిని ఎదుర్కోడానికి ఎండార్ఫిన్‌లు ఎక్కువ పాళ్లలో అవసరమవుతాయి. ఇటీవల చూస్తున్న ప్రధాన రోగాల్లో 80 శాతం స్ట్రెస్ కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
కారణాలు: ∙తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి ∙శరీర రోగ రక్షణ వ్యవస్థ బలహీనపడి ఉండటం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, దీర్ఘకాల వ్యాధుల తీవ్రత పెరుగుతుంది ∙ఆర్థిక సమస్యలు ∙పనిలో ఒత్తిడి ∙దీర్ఘకాలిక ఆందోళన, నిరాశ.
లక్షణాలు: ∙ఆవేశంగా ఉండటం, చిన్న చిన్న విషయాలకు కోపం రావడం ∙వికారం, తలతిరగడం ∙ఛాతీనొప్పి, గుండెలో స్పందన వేగం పెరగడం ∙చిరాకు, ఒంటరితనం ∙విరేచనాలు లేదా మలబద్ధకం ∙నిద్రలేకపోవడం
చికిత్స: హోమియో విధానంలో చికిత్స చేయడం ద్వారా స్ట్రెస్‌ను సమర్థంగా అదుపులో పెట్టవచ్చు. ఈ స్ట్రెస్‌కు గల కారణాలను పరిశీలించి, రోగి ఎంత స్ట్రెస్‌లో ఉన్నాడు, దాని తీవ్రత ఎంత, రోగి కుటుంబ, సామాజిక, ఆర్థిక స్థితిగతులేమిటి, అతడు పనిచేసే వాతావరణం ఎలా ఉంది... వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు హోమియోలో యాసిడ్‌ఫాస్, ఇగ్నీషియా, కాకులస్ ఇండికస్, నేట్రమ్‌మ్యూర్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల ఆధ్వర్యంలో వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి హైదరాబాద్
ముందుగా గుర్తిస్తే... గుండెపోటును దీటుగా ఎదుర్కోవచ్చు
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 40 ఏళ్లు. నేనొక మార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్‌గా పనిచేస్తున్నాను. నాకు తరచూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఈ విషయం స్నేహితులతో చెప్పినప్పుడు... అది గుండెపోటుకు దారితీయవచ్చుననీ, పరీక్షలు చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. గుండెపోటు ఎందుకు వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? – శ్రీధర్, కొత్తగూడెం
శరీరంలోని భాగాలన్నింటికీ రక్తం సరఫరా చేసే పంపింగ్ స్టేషన్ లాంటిది గుండె. కండరాలతో నిర్మితమైన ఈ గుండె సక్రమంగా పనిచేయడానికి దానికి శుద్ధమైన (ఆక్సిజన్‌తో కూడిన) రక్తం నిరంతరం సరఫరా జరుగుతూ ఉండాలి. కరొనరీ ధమనుల ద్వారా దానికి రక్తం అందుతూ ఉంటుంది. ఈ ధమనులకు వ్యాధి సోకితే అవి కుంచించుకుపోయి తగిన పరిమాణంలో శుద్ధమైన రక్తాన్ని సరఫరా చేయలేవు. కొవ్వు – క్యాల్షియమ్ – ప్రోటీన్ అణువులు రక్తనాళాల లోపలి గోడలపై పాచిలాగా పేరుకుపోవడం వల్ల ఈ రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అలా ధమని పూర్తిగా మూసుకుపోయిన పక్షంలో దాని ద్వారా రక్తం సరఫరా కావాల్సిన గుండె కండరాలకు పోషకాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఫలితంగా గుండెకండరాలు చచ్చుబడిపోతాయి. దాంతో గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండెపోటుకు ఇదే కారణం అయినప్పటికీ కరొనరీ ధమనుల్లో ఏర్పడే తీవ్రమైన సంకోచ వ్యాకోచాలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. ఈ విధంగా సంకోచించిన సమయంలో రక్తనాళాల (ధమనుల) ద్వారా గుండె కండరాలకు జరిగే రక్తసరఫరా చాలా తక్కువ పరిమాణానికి పడిపోవడమో లేదా పూర్తిగా నిలిచిపోవడమో జరుగుతుంది. వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కరోనరీ ధమనులకు సంబంధించి పెద్దగా సమస్యలు లేని సందర్భంలో కూడా ఇలా జరగవచ్చు. గుండెపోటులో ఈ కింద పేర్కొన్న లక్షణాలు ముందే కనిపిస్తాయి.
ఛాతీ–రొమ్ము ఎముక కింద – ఎడమచేతిలో భాగంగా, ఒత్తిడిగా, నొప్పిగా అనిపిస్తుంది ∙ఈ అసౌకర్యం వీపు వైపునకు, దవడలు, చేతి గుండా ఇతర అవయవాలకు వ్యాపిస్తున్నట్లుగా తోస్తుంది ∙కడుపు ఉబ్బరంగా, అజీర్తిగా, ఏదో అడ్డుపడుతున్నట్లుగా అనిపిస్తుంది ∙చెమటలు పట్టడం, వికారం, వాంతి వస్తున్నట్లుగా ఉంటుంది ∙చాలా బలహీనంగా, ఆందోళనగా ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా తోస్తుంది ∙గుండె వేగంగా, అసహజంగా కొట్టుకుంటుంది.
ఈ లక్షణాలు దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తాయి. అందువల్ల ఛాతీలో నొప్పి వస్తే ముందుగా ఆసుపత్రికి వెళ్లి, అది గుండెపోటు కాదని నిర్ధారణ చేసుకోండి. కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ కనిపించకుండా కూడా గుండెపోటు రావచ్చు. దీన్ని సైలెంట్ హార్ట్‌ఎటాక్‌గా పరిగణించవచ్చు. ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎవరికైనా రావచ్చు. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో ఈ రకమైన గుండెపోటు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు.
స్పష్టమైన లక్షణాలుతో, వెంటనే గుర్తించడానికి తెలిసిపోయే లక్షణాలతో గుండెలో అసౌకర్యం కలుగుతున్న విషయాన్ని గుర్తించినప్పుడు, తక్షణం ఆ రోగులను ఆసుపత్రికి చేరిస్తే, వారి ప్రాణాలు కాపాడవచ్చు. మన దేశంలో ప్రతి 33 సెకన్లకు ఒకరు గుండెపోటుకు గురవుతున్నారు. ఇలా ఏటా ఇరవై లక్షల మంది హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నట్లు అంచనా. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల వారితో పోలిస్తే భారతీయులు సగటున పది సంవత్సరాలు ముందుగానే గుండెపోటుకు గురవుతున్నారు. పైగా మన దేశస్తులలో గుండెపోటుకు గురవుతున్నవారిలో చాలా మంది యువకులు, మధ్యవయస్కులే ఎక్కువ. ఇలా స్పష్టమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అన్ని సౌకర్యాలు ఉన్న పెద్దాసుపత్రులకు వెళ్లి, తగిన పరీక్షలు చేయించుకుంటే ఎన్నో ప్రాణాలు అర్థంతరంగా ముగియకుండా కాపాడవచ్చు.
డాక్టర్ టి. శశికాంత్
సీనియర్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
ఒత్తిడితో నిద్ర కరువు
Published Tue, Jan 10 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
Advertisement