ఆశలపై నీళ్లు!
గద్వాల/మక్తల్: కరువు ప్రాంతంగా పేరొందిన పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. సిరులు పండించే భూములున్నా నీళ్లు లేకపోవడంతో బీళ్లుగా మారాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి పచ్చని పాలమూరుగా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రధాన ప్రాజెక్టులకు తొలిబడ్జెట్‌లో అరకొరగానే నిధులు విదిల్చింది. దీంతో పనులు పూర్తయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏటా మూడు పంటలు పండించుకోవచ్చని భావించిన ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఈ అత్తెసరు నిధులతో సకాలంలో సాగునీరు అందుతుందా..? అన్న సందేహం రైతుల్లో నెలకొంది. జిల్లాలో 87వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) నుంచి 30వేల ఎకరాలకు మించి అందడం లేదు. దీంతో ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీళ్లందని పరిస్థితిని అధిగమించేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ప్రతిపాదించారు. అందుకు అనుగుణంగా డీపీఆర్‌కు అనుమతించాల్సిన నీటిపారుదలశాఖ అధికారులు ఫైల్‌ను తరువాత చూద్దాంలే..అని పక్కకు పెట్టేశారు.
ఇదిలాఉండగా, ఆర్డీఎస్ తాత్కాలిక పనుల నిర్వహణకు రూ.13కోట్లు కేటాయించాలని అధికారులు నివేదించగా ప్రభుత్వం రూ.2.70కోట్లు మాత్రమే కేటాయించి ప్రతిపాదనల్లో కోత విధించింది. అయిజ, మానవపాడు, వడ్డేపల్లి మండలాల్లో ఆర్డీఎస్ కాల్వలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీల షట్టర్లు, పిల్లకాల్వలను బాగుచేయాల్సి ఉంది.
‘భీమా’కు భరోసా ఏది?
మక్తల్ నియోజకవర్గంలోని 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తే అసంపూర్తి పనులు పూర్తయి వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందుతుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది.
పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు రూ.150 కోట్లు కేటాయించాలని సాగునీరు పారుదల శాఖ అధికారులు ప్రతిపాదించగా, ప్రభుత్వం మాత్రం తొలి బడ్జెట్‌లో రూ.83.50కోట్లు మాత్రమే కేటాయించింది. రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లోనే రూ.750కోట్లను భీమా ఫేజ్-1 కింద కేటాయించారు. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.922కోట్లకు పెరిగింది. 2008లోనే పూర్తికావాల్సి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఎక్కడి పనులు అక్కడే..!
భీమా ప్రాజెక్టు కింద సంగంబండ, ఉ జ్జెల్లి, నేరడిగొమ్ము, భూత్పూర్, నాలు గు గ్రామాలను ముంపుప్రాంతాలుగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు బాధితులకు నష్టపరిహారం చెల్లించడం లో తీవ్రజాప్యం జరుగుతోంది. మక్తల్ మండలం పంచదేవ్‌పాడ్ వద్ద భీమా మొదటిదశ గ్రావిటీకెనాల్ బ్లాస్టింగ్ ప నుల కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డి మాండ్‌చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
పెండింగ్‌లో ఉన్న పనులకు రూ. 150కోట్లు ప్రతిపాదించగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 83.50కోట్లు కేటాయించడంతో పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకా శం కనిపిం చడం లేదు. ఈ నిధులు తా త్కాలిక అ వసరాలకే సరిపోతాయని ప్ర తిపక్షాలు విమర్శిస్తున్నాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పా టు వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీళ్లు అం దించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.