బిల్లు కట్టి బయటకెళ్లండి..!
ఓ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. జన్మనిచ్చిన తల్లి, కట్టుకున్న భార్య, కన్న కొడుకు కళ్ల ముందే కన్నుమూశారు. ఇక మిగిలింది ఒక్కడే.. విధి ఆడిన వింత నాటకంలో కుటుంబాన్ని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తిని చూస్తే ఎంతటి కఠినాత్ముడైనా అయ్యో పాపం అంటారు. కానీ ఆ ఆస్పత్రి యూజమాన్యం మాత్రం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించింది. మృతి చెందిన తన కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు వెళ్లేందుకు పంపించాలని కోరినా బిల్లు మొత్తం చెల్లించకుంటే పంపించమని మొండికేయడం వైద్య వృత్తికే మాయని మచ్చగా మారింది.
⇒ అంత్యక్రియలకు వెళ్లేందుకు క్షతగాత్రున్ని నిరాకరించిన ఆస్పత్రి యాజమాన్యం
⇒ ఆస్పత్రి వైద్యులతో బంధువుల వాగ్వాదం
⇒ సర్దిచెప్పి పంపించిన పోలీసులు
నిజామాబాద్ క్రైం: రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి బిల్లు చెల్లింపు విషయంలో మంగళవారం గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామం వద్ద కారు కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కారు నడుపుతున్న విజయ్‌కుమార్ కాలు విరగడంతో అతన్ని నిజామాబాద్‌లోని హైదరాబాద్‌రోడ్డు ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదంలో అతని తల్లి, భార్య, కుమారుడు మృతి చెందారు. వారి అంత్యక్రియలకు ఆయన తప్పనిసరిగా వెళ్లాల్సి ఉండటంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి పంపించాలని బంధువులను వైద్యులను కోరారు. అయితే ఆస్పత్రి యూజమాన్యం, సిబ్బంది మాత్రం చికిత్సకు అరుున రూ.70 వేలు చెల్లిస్తేనే పంపిస్తామని మొండికేశారు.
అయితే తమ వద్ద అంత మొత్తం లేదని రూ.10 వేలు చెల్లిస్తామని చెప్పినా వైద్యులు ఒప్పుకోలేదు. అయినా చికిత్సకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు వేయడంపై వారు మండిపడ్డారు. ఓ పక్క కుటుంబాన్ని కోల్పోయిన బాధలో ఉంటే బిల్లు కట్టకుంటే పంపించమని మొండికేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గొడవ మొదలైంది. దీంతో నాల్గవ టౌన్ ఎస్సై మధు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని శాంతించారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బిల్లు చెల్లిస్తామని చెప్పినా వైద్యులు ఒప్పుకోలేదు. చివరకు రూ.15 వేలు చెల్లిస్తామని చెప్పడంతో బిల్లు కట్టించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.