Bill payment
-
చిన్న కిటుకుతో సిబిల్ స్కోర్ పెంపు
సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో ఏదైనా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించే లోన్లు మరింత సులభంగా లభించే వీలుంటుంది. అప్పు ఇచ్చే ముందు ప్రతి ఆర్థిక సంస్థ సిబిల్‌ను చెక్ చేస్తుంది. సిబిల్ 750 కంటే ఎక్కువ ఉంటే లోన్లు జారీ చేయడం సులభం. మరి ఈ సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలుసా.. ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. కార్డు బకాయిలు చెల్లించే సమయంలో చిన్న కిటుకు ఉపయోగిస్తే సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’క్రెడిట్‌కార్డు బిల్లు జనరేట్ అయ్యాక చెల్లింపు కోసం కొన్నిరోజులు గడువు ఇస్తారు కదా. అయితే కార్డు బిల్లును గడువులోపు ఒకేసారి పూర్తిగా చెల్లించకుండా, రెండు లేదా మూడు సార్లు చెల్లిస్తే సిబిల్ పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ నెల 15వ తేదీన రూ.10,000 కార్డు బిల్లు వచ్చిందనుకుందాం. చెల్లింపు గడువు తేదీ 30 అనుకుందాం. అయితే ఈ 15 రోజుల్లో రెండుసార్లు అంటే ఒకసారి రూ.6000, మరో 5-6 రోజులకు మిగతా రూ.4000 చెల్లించాలి. దీనివల్ల పేమెంట్ రికార్డు పెరుగుతుంది. దాంతో సిబిల్ అధికమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం గుర్తించుకోవాలి. గడువులోపు కచ్చితంగా పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. -
ఇది తెలుసా? పబ్లిక్ హాలిడే అయినా జీతం పడుతుంది
ఒకటో తారీఖున ఆదివారామో, సెలవు రోజో వస్తే వేతన జీవులకు గండమే. సెలవు కావడంతో బ్యాంకులు జీతాలు జమ చేయవు. మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇకపై ఈ ఇక్కట్లకు చెల్లు చీటి రాసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సండేలతో పాటు ఇతర పబ్లిక్ హాలిడేస్‌లో కూడా బల్క్ పేమెంట్ చేసేందుకు, ఖాతాదారులు చేసే కీలక చెల్లింపులు స్వీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఎన్ఏసీహెచ్చ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (NACH) పథకాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారం ఇకపై ఆదివారాలు, అధికారిక సెలవు రోజుల్లో కూడా శాలరీస్, డివిడెండ్లు, పెన్షన్లు తదితర చెల్లింపులు జరుగుతాయి. చెల్లింపులకు ఓకే వేతనాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు కరెంటు, గ్యాస్, టెలిఫోన్, వాటర్ బిల్లులు, ఈఎంఐ, ప్రీమియం వంటి చెల్లింపులను బ్యాంకులు తీసుకుంటాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న మరికొన్ని మార్పులు - భారత తపాల శాఖ ఆధీనంలోని పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటి వరకు ఉచితంగా అందించిన డోర్ స్టెప్ సర్వీసెస్‌ని నిలిపేసింది. ఇకపై ఇంటి వద్దకు వచ్చి పోస్టల్ బ్యాంక్ సర్వీసెస్ అందిస్తే రూ. 20 ప్లస్ జీఎస్టీని వసూలు చేయనుంది. - పరిమితి మించిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఇప్పటి వరకు రూ. 15 సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తుండగా ఇప్పుడా మొత్తాన్ని రూ. 17కి పెంచారు. -
ఆక్సిజన్ పెట్టకుండానే బిల్లు!
సాక్షి, సిటీబ్యూరో: చాదర్‌ఘాట్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి నిర్వాకం ఇంకా మరిచిపోకముందే... తాజాగా గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్ ఆస్పత్రి వైద్యం పేరుతో ఎన్నారై వైద్యురాలికి షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో లేని స్పెషాలిటీ వైద్యులు వచ్చి రోగికి చికిత్సలు అందించినట్లు, ఖరీదైన మందులు వాడినట్లు, వెంటిలేటర్ అమర్చినట్లు...ఇలా ఇష్టం వచ్చినట్లు బిల్లు వేశారు. చేతికందిన బిల్లు చూసి..సదరు వైద్యురాలు షాక్‌కు గురైంది. ఇదెక్కడి ఘోరం అంటూ సెల్ఫీ వీడియో తీసి బయటికి వదలడంతో అది వైరల్ అయింది. అసలేమైందంటే... మూత్రనాళ సంబంధిత కేన్సర్‌తో బాధపడుతున్న నగరానికి చెందిన యాదగిరిరావు కేసరిని చికిత్స కోసం జూన్ 25న గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆయనతో పాటే ఆయన కుమార్తె , ఎన్నారై డాక్టర్ విజయకేసరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా ఆయనకు టెస్టులు నిర్వహించగా, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆయన కుమార్తె డాక్టర్ విజయకేసరి కూడా టెస్టు చేయించుకోగా, ఆమెకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమె కూడా ఇదే ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో అడ్మిటయింది. నిజానికి వీరిద్దరికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు లేవు. కానీ ఆస్పత్రి సిబ్బంది వారికి మెడికేషన్ ఇచ్చినట్లు, ఆక్సిజన్ పెట్టినట్లు బిల్లు వేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు బదులు ఫల్మొనాలజీ వైద్యుడిగా పేరు మార్చి అదనంగా మళ్లీ బిల్లు వేశారు. అదేమని అడిగితే.. నాలుగు రోజుల నుంచి మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. బలవంతంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌గారు దయచేసి కాపాడండి!.. అంటూ సెల్పీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు వీడియో వైరలైంది. ఇది అనైతికంః డాక్టర్ విజయకేసరి, బాధితురాలు మా నాన్నకే కాదు నాక్కూడా ఒక్క సింప్టమ్ కూడా లేదు. నాకు ఇంజక్షన్ ఇచ్చినట్లు, ఐవీ ఇచ్చినట్లు, ఆక్సిజన్ ఇచ్చినట్లు బిల్లు వేశారు. నిజానికి విటమిన్ సి, మల్టీవిటమిన్, యాంటి బయోటిక్ టాబ్లెట్స్ మినహా మరే ఇతర మందులు కానీ, ఇంజక్షన్లు కానీ ఇవ్వలేదు. రాని డాక్టర్ల పేరుతో రూ.లక్షల్లో బిల్లు వేశారు. అదేమని ప్రశ్నిస్తే...నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు చెల్లించాలో అర్థం కావడం లేదు. ఇండియాలో ఇదెక్కడి ఘోరం? ఇంత దారుణమా? అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరికీ..14 రోజులకు రూ.2.96 లక్షలేః ఏఐజీ ఆస్పత్రి తండ్రితో పాటు డాక్టర్ విజయ కూడా కోవిడ్ పాజిటివ్‌తో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసోలేషన్‌లో భాగంగా తండ్రి కుమార్తెలిద్దరూ వేర్వేరు రూమ్‌లను ఎంచుకున్నారు. తాను ఎన్నారై డాక్టర్‌నని, తనకు ప్రత్యేక రూమ్ కావాలని చెప్పిరోజుకు రూ.12 వేలు అద్దె ఉన్న గదిని ఎంచుకున్నారు. తండ్రికి రూ.ఆరు వేలు ఉన్న గదిని ఎంచుకున్నారు. వీరిద్దరి రూమ్‌రెంట్, మందులు, వైద్యుల ఛార్జీ ఇలా 14 రోజులకు మొత్తం రూ.2.96 లక్షల బిల్లు మాత్రమే వచ్చింది. ఆ బిల్లు చెల్లించడం ఇష్టం లేకే ఆమె ఆస్పత్రిపై ఆరోపణలు చేస్తోందని ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. -
రీచార్జ్, బిల్లు చెల్లింపు సమస్యలకు టెల్కోలదే బాధ్యత
న్యూఢిల్లీ: థర్డ్‌పార్టీ వెబ్సైట్లు, యాప్స్ ద్వారా వినియోగదారులు జరిపే రీచార్జ్‌లు, బిల్లు చెల్లింపుల్లో సమస్యలు ఏర్పడితే, వాటికి టెలికం కంపెనీలే బాధ్యత వహించాలని టెలికం నియంత్రణా సంస్థ ట్రాయ్ హెచ్చరించింది. పేమెంట్ సదుపాయాన్ని కల్పించే థర్డ్‌పార్టీ వెబ్సైట్లు, అప్లికేషన్లు లెసైన్సులు లేని సంస్థలని, వాటిని టెలికాం సంస్థలే నియమించుకున్నందున, సమస్యలు ఏర్పడితే వాటికి ఆపరేటర్లే బాధ్యత వహించాలంటూ ట్రాయ్ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రస్తుతం ఫ్రీచార్జ్, మెబిక్విక్, ఆక్సిజన్ వంటి పలు మొబైల్ యాప్స్, వెబ్సైట్లు...టెలికాం కంపెనీల చానల్ పార్టనర్లుగా మొబైల్ రీచార్జ్, బిల్లు చెల్లింపు సదుపాయాల్ని అందిస్తున్నాయి. -
వేలిముద్రలతో బిల్లు చెల్లింపులు!
లండన్: మనకు షాపింగ్ కేంద్రాల్లో డెబిట్/క్రెడిట్ కార్డులు, ముఖకవళికలు, సెల్ఫీలతో చేసే చెల్లింపులు తెలుసు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త సాంకేతికతతో వేళ్లలోని సిరలు(గుండెకు చెడురక్తాన్ని తీసుకెళ్లేనాళాలు) సాయంతో బిల్లులు చెల్లించొచ్చు. ‘ఫింగోపే’గా సాంకేతికతను యూకేలోని ఒక స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. వేలిసిరల నిర్మాణాన్ని బట్టి వినియోగదారుడికి ప్రత్యేక గుర్తింపును ఇది కేటాయిస్తుంది. దీన్ని బ్యాంకు ఖాతాతో అనుసంధానిస్తుంది. బిల్లు చెల్లింపు సమయంలో అతను తన వేలిని స్కానర్‌పై ఉంచితే చాలు. డబ్బు బదిలీ అయిపోతుంది. కార్డులు/నగదు మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 340 కోట్ల మందిలో ఒకరి సిరలు మాత్రమే మరోవ్యక్తి సిరలను పోలి ఉంటాయట. -
బిల్లు కట్టి బయటకెళ్లండి..!
ఓ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. జన్మనిచ్చిన తల్లి, కట్టుకున్న భార్య, కన్న కొడుకు కళ్ల ముందే కన్నుమూశారు. ఇక మిగిలింది ఒక్కడే.. విధి ఆడిన వింత నాటకంలో కుటుంబాన్ని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తిని చూస్తే ఎంతటి కఠినాత్ముడైనా అయ్యో పాపం అంటారు. కానీ ఆ ఆస్పత్రి యూజమాన్యం మాత్రం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించింది. మృతి చెందిన తన కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు వెళ్లేందుకు పంపించాలని కోరినా బిల్లు మొత్తం చెల్లించకుంటే పంపించమని మొండికేయడం వైద్య వృత్తికే మాయని మచ్చగా మారింది. ⇒ అంత్యక్రియలకు వెళ్లేందుకు క్షతగాత్రున్ని నిరాకరించిన ఆస్పత్రి యాజమాన్యం ⇒ ఆస్పత్రి వైద్యులతో బంధువుల వాగ్వాదం ⇒ సర్దిచెప్పి పంపించిన పోలీసులు నిజామాబాద్ క్రైం: రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి బిల్లు చెల్లింపు విషయంలో మంగళవారం గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామం వద్ద కారు కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో కారు నడుపుతున్న విజయ్‌కుమార్ కాలు విరగడంతో అతన్ని నిజామాబాద్‌లోని హైదరాబాద్‌రోడ్డు ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదంలో అతని తల్లి, భార్య, కుమారుడు మృతి చెందారు. వారి అంత్యక్రియలకు ఆయన తప్పనిసరిగా వెళ్లాల్సి ఉండటంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి పంపించాలని బంధువులను వైద్యులను కోరారు. అయితే ఆస్పత్రి యూజమాన్యం, సిబ్బంది మాత్రం చికిత్సకు అరుున రూ.70 వేలు చెల్లిస్తేనే పంపిస్తామని మొండికేశారు. అయితే తమ వద్ద అంత మొత్తం లేదని రూ.10 వేలు చెల్లిస్తామని చెప్పినా వైద్యులు ఒప్పుకోలేదు. అయినా చికిత్సకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు వేయడంపై వారు మండిపడ్డారు. ఓ పక్క కుటుంబాన్ని కోల్పోయిన బాధలో ఉంటే బిల్లు కట్టకుంటే పంపించమని మొండికేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గొడవ మొదలైంది. దీంతో నాల్గవ టౌన్ ఎస్సై మధు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని శాంతించారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బిల్లు చెల్లిస్తామని చెప్పినా వైద్యులు ఒప్పుకోలేదు. చివరకు రూ.15 వేలు చెల్లిస్తామని చెప్పడంతో బిల్లు కట్టించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.