ఇక్కడ..లొల్లి | Hospitals Development Committee Appointment | Sakshi
Sakshi News home page

ఇక్కడ..లొల్లి

Published Sat, Dec 13 2014 4:09 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఇక్కడ..లొల్లి - Sakshi

ఇక్కడ..లొల్లి

మంత్రికి తెలియకుండానే ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ నియామకం
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులకు ప్రాధాన్యమిచ్చిన జెడ్పీ చైర్మన్
కలెక్టర్‌కు తెలియకుండానే సమావేశం ఏర్పాటు
మంత్రి జోక్యంతో వాయిదా
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల మధ్య సఖ్యతకు భంగం!

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) పదవులను సజావుగా పంచుకున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య కొత్త లొల్లి మొదలైంది. ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన ‘రాజీ’ మూడుగంటల ముచ్చటగానే మిగిలిపోయి రాజకీయ వైరానికి దారితీసింది. జిల్లా ఆస్పత్రుల అభివృద్ధి సలహా కమిటీ నియామకంలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ పూర్తిగా కాంగ్రెస్ వారికే ప్రాధాన్యం ఇవ్వడం, ప్రభుత్వం నియమించాల్సిన ఎమ్మెల్యేలను తానే నామినేట్ చేయడం, జిల్లా మంత్రికి తెలియకుండానే సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం కొత్త వివాదానికి దారితీసింది. తనకు తెలియకుండానే కమిటీని నియమించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారని తెలుసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమావేశాన్ని వాయిదా వేయించినట్టు సమాచారం.

జిల్లా ఆస్పత్రుల అభివృద్ధి సలహా కమిటీ చైర్మన్‌గాజెడ్పీచైర్మన్, కార్యదర్శిగా కలెక్టర్ ఉంటారు. ఇందులో రాజకీయ నాయకులకు కూడా స్థానం కల్పించాల్సి ఉంటుంది. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా కమిటీలో తీసుకోవాలి. అయితే, ఎంపీపీలు, జెడ్పీటీసీలను నియమించే అధికారం జెడ్పీచైర్మన్‌కు ఉన్నా ఎమ్మెల్యేలను మాత్రం ప్రభుత్వం (జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి) సిఫారసు చేయాల్సి ఉం టుంది.

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను అధికారికంగా నియమించనందున జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి ఎమ్మెల్యేల పేర్లను సిఫారసు చేయాలి. ఏం జరిగిందో ఏమో కానీ... మంత్రికి, ప్రభుత్వానికి తెలియకుం డానే జెడ్పీచైర్మన్ బాలునాయక్ ముగ్గు రు ఎమ్మెల్యేలను కూడా నియమించేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, ఓ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కమిటీ సభ్యులుగా నియమించేశారు. జెడ్పీటీసీ, ఎంపీపీలను కూడా కాంగ్రెస్ వారినే నియమించారు. జెడ్పీచైర్మన్ ఆదేశాలతో ఈ కమిటీని ఖరారు చేసిన వైద్యశాఖ అధికారులు  కలెక్టర్‌కు తెలియకుండానే శనివారం కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

కనీసం సమావేశ ఏర్పాటు గురించి మంత్రి జగదీష్‌రెడ్డికి సమాచారం కూడా ఇవ్వలేదు. దీనిపై మంత్రి జిల్లా ఉన్నతాధికారులను ఆరాతీయడంతో అసలు విష యం వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుం డా కమిటీని నియమించి సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని మంత్రి వైద్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆ శాఖ ఉన్నతాధికారులు జెడ్పీచైర్మన్‌ను ఒప్పించి సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఆస్పత్రుల అభివృద్ధి కమిటీని వెంటనే రద్దు చేయాలని మంత్రి ఆదేశించినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో డీపీసీ పదవులను ఏ పేచీ లే కుండానే పంచుకున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ అగాథం ఏర్పడిందని, జిల్లా ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ నియామకం కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీస్తుందని రాజకీ య వర్గాలంటున్నాయి. అసలు జిల్లా మంత్రికి తెలియకుండా కమిటీని నియమించి, సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్‌ఎస్ అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ విషయమై తాడోపేడో తేల్చుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో నూ ఈ కమిటీని అంగీకరించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజా రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకుల పంచాయితీ ఏ మలు పు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement