‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు దేవేంద్రనాథ్‌ను సత్కరిస్తున్న మంత్రి హరీశ్‌రావు, అల్లం నారాయణ
సాక్షి, సిటీబ్యూరో: ఫొటోగ్రఫీ ఒక అద్భుతమై కళ. వంద పేజీల అర్థాన్ని ఒక్క ఫొటో తెలియజేస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోషియేషన్ (టీపీజేఏ) ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాజీవితంలో ఉన్నవారు, ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు భద్రంగా ఉండాలని సీఎం చాలాసార్లు చెబుతూంటారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉందని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కోర్టు కేసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిపై సీఎంతో తాను ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు. త్వరలో ఈ పని పూర్తయ్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మెరుపుకంటే వేగంగా పనిచేసేవాడే ఫొటో జర్నలిస్టు అని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఫొటోగ్రాఫర్ల కష్టాలను కళ్లారా చూశామన్నారు. ఉద్యమ కాలంనాటి ఫొటోలు రేపటి చర్రితకు సాక్ష్యంగా నిలుస్తాయని హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోని మంచి ఫొటోలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు ప్రెస్ అకాడమీ శ్రీకారం చుట్టాలన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు సూచించిన రెండు అంశాలను నెరవేర్చే బాధ్యత ప్రెస్ అకాడమీ తీసుకొంటుందన్నారు. కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్న సాక్షి ఫొటోగ్రాఫర్లు ఇసుకపట్ల దేవేంద్రనాథ్ (హైదరాబాద్), యాకయ్య (సూర్యాపేట), యాదిరెడ్డి (వనపర్తి) ఆర్.రాజు (ఖమ్మం)లను మంత్రి సత్కరించారు. భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీపీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు జి.భాస్కర్, జర్నలిస్టుల సంఘం నాయకుడు పల్లె రవి, ఎంపీ టీపీ పాటిల్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment