
గృహ నిర్మాణ సంస్థ రద్దు!
ఇతర శాఖలకు ఉద్యోగుల కేటాయింపు
- తాగునీటి పథకాలన్నీ మిషన్ భగీరథ పరిధిలోకి..
- సర్వేయర్ల భర్తీకి తక్షణ చర్యలు
- స్త్రీ, శిశు, వికలాంగ శాఖల విలీనంపై పునః పరిశీలన
- శాఖల పునర్వ్యవస్థీకరణ చర్యలకు కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆ సంస్థ ఉద్యోగులను ఇతర శాఖలకు కేటాయించాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణపై గత గురువారం నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. వాటి ప్రకారం అధికారులు పలు చర్యలు చేపట్టారు.
ఆ వివరాలు..
► రాష్ట్రంలోని తాగునీటి పథకాలన్నింటినీ మిషన్ భగీరథ ఆధ్వర్యంలో చేపట్టాలి. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నీటిపారుదల శాఖ వ్యవహరించాలి.
► పర్యాటక, సాంస్కృతిక శాఖ వ్యవహారాలను జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) చేపట్టాలి.
► క్రీడలు, ఎన్‌సీసీ, యువజన వ్యవహారాలను యువజన సంక్షేమ అధికారి పర్యవేక్షించాలి.
► ప్రతి జిల్లాలో ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో)ను ప్రణాళిక శాఖ నియమించాలి.
► జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ, 108, 104, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం విభాగాల నిర్మాణంపై ఆరోగ్య శాఖ పరిశీలన జరపాలి.
►ఎమ్మార్వోను తహసీల్దార్‌గా, డిప్యూటీ తహసీల్దార్‌ను నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను గిర్దావర్‌గా, ఎమ్మార్వో కార్యాలయాన్ని తహసీల్ కార్యాలయంగా పేర్లు మార్చాలి. సర్వేయర్ల నియామకాలను వేగంగా పూర్తి చేయాలి.
► ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుపై పరిశ్రమల శాఖ పునః పరిశీలన జరపాలి.
► 13 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన జిల్లా కార్యాలయాలను ప్రాంతీయ యూనిట్ కార్యాలయాలుగా మార్చాలి.
► పశు సంవర్థక, మత్స్య శాఖలను వేర్వేరుగా కొనసాగించాలి.
► స్త్రీ, శిశు, వికలాంగులు, వయోజనుల సంక్షేమ శాఖల విలీనంపై పునః సమీక్ష జరపాలి.
► ఆర్థిక శాఖ ట్రెజరీ, పీఏవో కార్యాలయాల సంఖ్యను పెంచాలి. పని ఒత్తిడి ఆధారంగా ఎస్టీవో కార్యాలయాలకు ఉద్యోగులను కేటాయించాలి.
ప్రతి జిల్లాకో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ అవసరమా, కాదా పరిశీలించాలి.
►పని ఒత్తిడి ఆధారంగా మైనారిటీ, అటవీ, గిరిజన, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల స్టాఫ్ ప్యాటర్న్‌ను కొత్తగా ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లాల్లో ఒకే విధంగా స్టాఫ్ ప్యాటర్న్ ఉండాల్సిన అవసరం లేదు.
► పారదర్శకత కోసం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సేవల పట్టికను రూపొందించుకోవాలి.