
ఆ శునకాలకు ఎంత విశ్వాసమో..!
తిండిమాని యజమానులను దహనం చేసిన చోటే ఉన్న వైనం
కుక్కను విశ్వాసానికి చిహ్నంగా చెప్పుకుంటారు. ఇది నిజమే అని అనిపించే సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఓ దంపతులు పెంచుకున్న కుక్కలు వారు మరణించిన నాటి నుంచి తిండి తిప్పలు మాని వారిని దహనం చేసిన వద్దే తిరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ గ్రామంలో అప్పుల బాధతో రైతు దంపతులు మోహనాచారి, సరిత ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే వీరు పొలం పనులు చేసుకుంటూ వారి వ్యవసాయక్షేత్రం వద్దే నివాసం ఉండేవారు. వీరికి పిల్లలు లేకపోవడంతో కుక్కలను పెంచుకున్నారు. ఆ కుక్కలు తమ యజమానులు మరణించిన రోజునుంచి తిండి తిప్పలు మానేసి దహనం చేసిన చోటు నుంచి కదలడం లేదు. ఎవరైనా వెళ్లగొట్టినా అరుస్తూ, మృతదేహాలు కాలిన బూడిద చుట్టూ తిరుగుతున్నాయి. –మంచాల