పండుగకు పస్తులేనా?
దుబ్బాక: వేతనాలు అందక 104 సిబ్బంది నరకయాతన అనుభవిస్తున్నారు. దసరా పండుగకు సైతం పస్తులు తప్పేటట్టులేవంటున్నారు. పొద్దస్తమానం రోగులతోనే సహవాసం చేసే 104 సిబ్బంది కష్టాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చేసిన రెక్కల కష్టానికి ఫలితం దక్కడం లేదు. శ్రమ దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే అధికారి లేరు. ప్రభుత్వ రంగ సంస్థలో పని చేస్తున్నామన్న ధీమాతోనే కలో గంజో తాగుతూ విధులను క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. జిల్లాలో 10 క్లష్టర్లుండగా 21 వాహనాలు నడుస్తున్నాయి. వీటిలో 90 వరకు వివిధ హోదాల్లో (ఫార్మసిస్టు, డ్రైవర్, ల్యాబ్ టెక్నిషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్) సిబ్బంది విధులను నిర్వర్తిస్తున్నారు.
ప్రజల యోగా క్షేమాలు ఎప్పటికప్పుడు చూసే 104 సిబ్బందికి మాత్రం మూడు నెలలుగా జీతం రావడం లేదు. ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య ఉండే వెండర్ వల్ల జీతాల్లో అవకతవకలు జరగడమే కాకుండా జీతాలు అలస్యంగా వస్తున్నాయి. ట్రెజరీ ద్వారా జీతాలిస్తే నెల నెలా వచ్చే అవకాశం ఉంది. 104 వాహనాలకు ఇన్సూరెన్స్ కూడా లేదు. ఒకవేళ ప్రమాదాలకు గురైతే మాత్రం ఆ కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరమే. అధికారుల నిర్లక్ష్యం వల్లే వారికి వేతనాలు అందడంలేనట్టు తెలుస్తోంది. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. బిల్లుల కోసం చెప్పులరిగేలా తిరిగినా ఫైల్ మాత్రం కదలదు.
అమ్యామ్యాలు ముట్టచెప్పనిదే బిల్లుల ఫైల్ చేతికందదు. ‘దసరా పండుగ వస్తోంది. ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు కొనివ్వాలి. ఇంత వరకు జీతాల ఊసెత్తడం లేదు. ఇప్పటికే అప్పులు చేశాం. అప్పులొళ్లు కూడా నమ్మడం లేదు. ఈ సారైనా జీతాలు రాకుంటే దసరా పండుగకు పస్తులు తప్పవ’ని 104 సిబ్బంది వాపోతున్నారు. వెంటనే జీతాలు చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి వేడుకుంటున్నారు.