తెలంగాణలో జిల్లాకొక సభ: బాబు
ఖమ్మం సభ తరహాలో తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ ఒకటి చొప్పున సభలను నిర్వహించనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఖమ్మంలో శనివారం నాటి సభకు గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలోనూ రానంత పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని చెప్పారు. తెలంగాణ అంశంలో తనది రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరికాయ సిద్ధాంతమని కొందరు ఎద్దేవా చేశారని.. తాను చెప్పిందే సరైందని ఇప్పుడు రెండు ప్రాంతాల ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పార్టీ అభ్యర్థుల ఎంపిక చేపడతానని గతంలో చెప్పిన చంద్రబాబు ఇందుకు సంబంధించిన ప్రక్రియకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ‘మీ ఊరు-మీ అభ్యర్థి-మీ ఇష్టం’ పేరిట పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులకు ఫోన్ చేసి.. వారి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సూచించే ముగ్గురి అభ్యర్థుల్లో ఎవరు గెలవగలరో అభిప్రాయాలు అడుగుతారు. ముగ్గురూ నచ్చకపోతే కొత్త పేర్లను సూచించే అవకాశమిస్తారు. తన అభ్యర్థిత్వంపైనా కుప్పం నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ కోరతానని చెప్పారు.
శత్రుచర్ల చేరిక: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్, రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి మేడా మల్లిఖార్జునరెడ్డి ఆదివారం వేర్వేరుగా బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం శత్రుచర్ల విలేకరులతో మాట్లాడుతూ బాబు నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేయమని కోరితే అక్కడ్నుంచి పోటీ చేస్తానన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యాసంస్థ అధినేత ఎం.కృష్ణారావు కూడా టీడీపీలో చేరారు.
ఐదు జిల్లాల్లో ప్రజాగర్జన సభలు: ఇదిలా ఉండగా ఈ నెల 21న కర్నూలు, 22న మహబూబ్‌నగర్, 25న కడప, 26న కృష్ణా, 27న తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగే ప్రజాగర్జన సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారని పార్టీ ఉపాధ్యక్షుడు కె.రామ్మోహనరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యుత్ కోతలు లేకుండా చూడాలంటూ గవర్నర్‌కు బాబు లేఖ
రాష్ట్రంలో పంటలు ఎండిపోకుండా ఏప్రిల్ 15 వరకు వివిధ ప్రాజెక్టుల కింద సాగునీటిని విడుదల చేయాలని, విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ చంద్రబాబు ఆదివారం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు.