‘సైకిల్’ ప్రచారం.. గాలికే | 'Cycle' campaign .. air... | Sakshi
Sakshi News home page

‘సైకిల్’ ప్రచారం.. గాలికే

Published Sun, Apr 20 2014 2:08 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

‘సైకిల్’ ప్రచారం.. గాలికే - Sakshi

‘సైకిల్’ ప్రచారం.. గాలికే

మహబూబ్‌నగర్, వరంగల్ సభలతో సరి
సీమాంధ్రపైనే దృష్టి నిలిపిన చంద్రబాబు
 

 తెలంగాణలో రూ. వందల కోట్లు ఖర్చు చేసినా తెలుగుదేశం ఉనికి కాపాడడం కష్టమేనన్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడు వచ్చారా..? తెలంగాణలో ప్రచారానికి సమయం కేటాయించడం కూడా వృథా అని భావిస్తున్నారా...? తెలంగాణ తెలుగుదేశాన్ని పూర్తిగా బీజేపీకి ధారాదత్తం చేశారా...? తెలంగాణలోని పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కదిలిస్తే... ఔననే బల్లగుద్ది మరీ చెపుతున్నారు.
 
 (పోలంపల్లి ఆంజనేయులు)
 
తెలంగాణ జిల్లాల్లో ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. 28వ తేదీతో ప్రచారపర్వం పరిసమాప్తమవుతుంది. ఇక్కడ టీడీపీ నుంచి 72 చోట్ల పోటీ చేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా  కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు  దూసుకుపోతుండగా, తెలుగుదేశం అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్రపైనే దృష్టి పెట్టగా, స్టార్ క్యాంపెయినర్ లేక తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డ టీడీపీ తరపున ప్రజల్లోకి వెళ్లలేక సతమతమవుతున్నారు.  
 
ప్రచారకర్తలు తలోదారి

 పార్టీ ఎన్నికల కమిటీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, కన్వీనర్ మోత్కుపల్లి నర్సిహులు, తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య సొంత నియోజకవర్గాలు దాటి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అభ్యర్థులు దేవునిపై భారం వేసుకుంటున్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచార పర్వం మొదలుగాక ముందు మహబూబ్‌నగర్, వరంగల్‌లో ప్రజా గర్జన సభలు నిర్వహించారు. ఆ తరువాత చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు జరిపారు. తెలంగాణలో టీడీపీకి వచ్చే సీట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమేనని భావిస్తున్న చంద్రబాబు ఇతర జిల్లాలకు వెళ్లినా ఉపయోగం లేదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తెలంగాణలో సభలు నిర్వహిస్తే, ఆయనతో పాటే పాల్గొని మమ అనిపించే యోచనలో ఆయన ఉన్నారు. ఈనెల 22న నరేంద్రమోడీ నాలుగు జిల్లాల సభల్లో పాల్గొంటున్నారు. తెలంగాణలో ప్రచారాన్ని గాలికొదిలేసిన బాబు మే 7న ఎన్నికలు జరిగే సీమాంధ్రలో నామినేషన్ల ప్రక్రియ పూర్తికాకముందే ప్రచార కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. మరోవైపు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు తెలంగాణ పేరుతో రోజుకో జిల్లాను చుట్టివస్తున్నాయి.

 ప్రజల్లోకి వెళ్లేదెప్పుడు..?

 తెలంగాణ వాదం అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతుండగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనంలోకి వెళ్లేందుకే భయపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ జగిత్యాలలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. బీజేపీ నుంచి సహకారం లేదు. దీంతో ఆయనే ఊరూరా తిరుగుతున్నా, సరైన స్పందన రావడం లేదు. కరీంనగర్‌లోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు నిర్వేదంలో మునిగిపోయారు. తెలంగాణ టీఆర్‌ఎస్ వల్లనే వచ్చిందన్న వాదనను తిప్పికొటే నాయకుడే లేకుండా పోయాడని, ఈ పరిస్థితుల్లో ఎలా జనంలోకి వెళ్లాలని ఆయా అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

 ప్రచారంలోనూ ఒంటరి పోరే...

 ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ రమేష్ రాథోడ్, ఆయన కొడుకు రితేష్ రాథోడ్ ఖానాపూర్ నుంచి పోటీ చేస్తుండగా వీరిద్దరు తమకున్న సంబంధాలతో ప్రచారం సాగిస్తున్నారు. కానీ నిర్మల్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ఈ జిల్లాలోని టీడీపీ అభ్యర్థులకు గులాబీ భయం పట్టుకుంది. వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేస్తున్న పాలకుర్తిలోనూ అదే పరిస్థితి. ఎర్రబెల్లి తనకున్న పరిచయాలతో ఒంటరిపోరు సాగిస్తున్నారు. మరో ముఖ్యనేత మోత్కుపల్లి నర్సింహులు సిట్టింగ్ స్థానాన్ని వదిలి ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఇక్కడ స్థానికత అడ్డంకిగా మారింది. మహబూబ్‌నగర్‌లో ఈసారి తెలంగాణ వాదం బలంగా వినిపిస్తుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వణుకుతున్నారు. ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నప్పటికీ, పొత్తుల్లో వచ్చిన భేదాల వల్ల సహకారం అందడం లేదు. ఖమ్మంలో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతూనే ఉంది. రంగారెడ్డి రూరల్ జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభంజనం వీస్తుంటే, కొత్తగా తెరపైకి వచ్చిన టీడీపీ అభ్యర్థులు జనాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో బహుముఖపోటీ నెలకొని ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement