సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వీఆర్వో ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 700 పోస్టులకు గాను 10,58,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్ చేసిన వారూ పోటీ పడుతున్నారు. అత్యధికంగా 4,49,439 మంది డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోగా.. ఇంటర్ పూర్తి చేసిన వారు 4,17,870 మంది ఉన్నారు. పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు 372 మంది, ఎంఫిల్ చేసిన వారు 539 మంది, పీజీ పూర్తి చేసిన వారు 1,51,735 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 16న జరగనున్న పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.
కరీంనగర్ టాప్
పాత జిల్లాల ప్రకారం చూస్తే ఉమ్మడి కరీంనగర్ నుంచి అత్యధికంగా 1,56,856 మంది అభ్యర్థులు వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత స్థానంలో మహబూబ్‌నగర్ ఉంది. ఈ జిల్లా నుంచి 1,56,096 దరఖాస్తులొచ్చాయి. హైదరాబాద్ జిల్లా నుంచి తక్కువ మంది (47,059) దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 14,042 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
బీసీలే 6 లక్షల మంది
వీఆర్వో పోస్టుల కోసం 6,06,717 మంది పురుషులు.. 4,52,151 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే అత్యధికంగా ఎస్సీలు 2,44,746 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత స్థానంలో బీసీ–బీ అభ్యర్థులు (2,41,058 మంది) ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో బీసీ అభ్యర్థులే 6 లక్షల మంది వరకు ఉన్నారు. 1,02,427 మంది ఎస్టీ అభ్యర్థులు కొలువుల కోసం పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment