మొగుడు కాదు.. రాక్షసుడు
► భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
► భార్య చనిపోయిందనుకుని తానూ గొంతుకోసుకున్న వైనం
► ముస్కాన్‌పేటలో సంఘటన
► గర్భం ఎలా వచ్చిందని అనుమానం
► డీఎన్‌ఏ టెస్టు చేయించుకోవాలని పట్టు
► పెళ్లయిననాటి నుంచి చిత్రహింసలే బాధితురాలు ప్రియాంక
ఇల్లంతకుంట(మానకొండూర్): పచ్చటి పెళ్లిపందిరి.. వేదపండితులు... అగ్నిగుండం సాక్షిగా ఏడడుగులు నడిచి తాళికట్టి జీవితాంతం తోడుంటానని బాస చేసిన మొగుడే అనుమానంతో ఉన్మాదిగా మారాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చాలని పథకం పన్నాడు. కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. భార్య మృతి చెందిందని భావించి అదే కత్తితో గొంతుకోసుకుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటలో జరిగింది.
బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర మహేష్(26)కు ఏడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొండ శ్రీనివాస్–లావణ్య దంపతుల పెద్ద కూతురు ప్రియాంక(22)తో వివాహమైంది. పెళ్లయిన నాటినుంచి మహేశ్ భార్యను అనుమానిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడు. అయినా ఓపికగా భరించింది. ఈ క్రమంగలో ప్రియాంక గర్భందాల్చింది. పది రోజుల క్రితం భార్యను పుట్టింటికి పంపించాడు. మూడు రోజుల క్రితం మళ్లీ ఫోన్ చేయడంతో ప్రియాంక మెట్టింటికి వచ్చింది.
‘నీకు వచ్చిన కడుపు నాతో రాలేదని, ఇంకెవరితోనో వచ్చిందని మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవాలని వేధించాడు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కరెంటుషాక్ పెట్టేందుకు మహేశ్ ప్రయత్నించగా తీగలను ప్రియాంక లాగేసింది. దీంతో కోపోద్రిక్తుడై కత్తితో దాడిచేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రియాంకను అత్త వీరమ్మ గమనించి పెద్ద కొడుకు శ్రీనివాస్‌కు సమాచరమందించింది. అతను ద్విచక్రవాహనంపై సిరిసిల్ల ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ప్రతిమా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ప్రియాంక మృతిచెంది ఉంటుందనే భయంతో మహేశ్ అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. స్థానికులు మహేశ్‌ను భార్య చికిత్స పొందుతున్న ఆస్పత్రికే తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. ప్రియాంక ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. రక్తం బాగా పోయిందని, కడుపులో బిడ్డను తీసేస్తేనే ప్రియాంక ప్రాణాలు దక్కుతాయని వైద్యులు చెప్పినట్లు బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు
గుక్కెడు నీళ్ళివ్వమన్నా దగ్గరకు రాలేదు....
తన భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా కేకలు వేసుకుంటూ ఇంటి ముందు వాకిట్లో రక్తపు మడుగులో కొట్టుకుంటూ గుక్కెడు నీళ్ళివ్వమన్నా ఊళ్లోవారెవరూ దగ్గరకు రాలేదని దాహంతో అల్లాడిపోయినా ఎవరూ పట్టించుకోలేదని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ప్రియాంక రోదిస్తూ తెలిపింది. అనుమానంతో సైకోగా మారి తన ప్రాణాల్ని తీయాలనుకున్న భర్త మహేశ్‌ను వదిలిపెట్టొద్దని ఎస్సైని వేడుకుంది.