
అందంగా లేదని భార్యను చంపిన భర్త
కట్టుకున్నవాడే కాలయముడై కడతేర్చాడు. భార్య అందంగా లేదంటూ చిత్రహింసలకు గురిచేశాడు. పెళ్లయిన ఏడాదికే చున్నీతో గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. ఈ సంఘటన కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు.. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కోటపల్లి : మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా పరిధి రంగయ్యపల్లికి చెందిన ఏదండ్ల ఈశ్వ రి, స్వామి దంపతుల కుమార్తె లలిత(23) వివాహం రొయ్యలపల్లికి చెందిన సల్పాల సంతోష్‌తో గతేడాది మే 13న జరిగింది. వివాహ సమయంలో కట్నంగా రూ.3 లక్షలు, ఇతర లాంఛనాలను లలిత తల్లిదండ్రులు సంతోష్‌కు అందజేశారు. ఐదు నెలల పాటు సంతోష్, లలితల కాపురం సాఫీగా సాగింది. అనంతరం అందంగా లేవంటూ సంతోష్ నిత్యం భార్యను వేధించేవాడు.
శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఈ విషయాన్ని లలిత తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు సంతోష్‌ను మందలించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర పెనుగులాట చోటుచేసుకుంది. ఆగ్రహించిన సంతోష్ చున్నీతో లలిత గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. గురువారం వేకువజామున విషయం ఇరుగుపొరుగువారికి తెలియడంతో అతడు పారి పోయాడు. సీఐ చంద్రబాను, ఎసై కిరణ్‌కుమార్, తహశీల్దార్ మధునయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పెళ్లయిన ఏడాదికే లలిత హత్యకు గురవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నం టాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.