సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో వినాయక నిమజ్జనం ముగిసింది. ఈ సారి హుస్సేన్‌సాగర్‌లో సుమారు 50 వేలు, శివార్లలో ఏర్పాటు చేసిన 40 నిమజ్జన కొలనులు, చెరువుల్లో మరో 35 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్‌ఎంసీ, పీసీబీ విభాగాల అంచనా. దీంతో ఆయా జలాశయాలు కాలుష్యకాసారంగా మారుతున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ సహా ఇతర జలాశయాల కాలుష్యం వల్ల కలిగే అనర్థాలపై ఆందోళన చెందుతున్నారు.
హుస్సేన్‌సాగర్‌లో ఇలా..
గణేష్ నిమజ్జనంతో ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లోకి సుమారు 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ చేరినట్లు అంచనా. అయితే ఇందులో ఇనుము, కలప, తదితర ఘన వ్యర్థాలను బల్దియా ఎప్పటికప్పుడు తొలగించినప్పటికీ పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీటిలో కలిసిపోవడంతో సాగర్ మరింత గరళసాగరంగా మారనుంది. దీంతో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయలాజికల్ ఆక్సీజన్ డిమాండ్(బీఓడి) ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ రోజుల్లో ఇది 35 నుంచి 40 పీపీఎం మించదు. ఇక కెమికల్ అక్సీజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడి) 200 పీపీఎంను మించే ప్రమాదం ఉంది. సాధారణ రోజుల్లో ఇది 80–100 పీపీఎం మించదు. దీనికితోడు జలాశయం నీటిలో ఆక్సీజన్ స్థాయి దారుణంగా పడిపోనుంది. ఇది ప్రతి లీటరు నీటిలో ‘సున్న’గా నమోదయ్యే ఆస్కారం ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారుచేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడంతో అందులోని హానికారక రసాయనాలు ఆయా జలాశయాల్లో చేరి పర్యావరణ హననం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హానికారక రసాయనాలు, మూలకాలివే..
రసాయన రంగుల అవశేషాలివే: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆౖMð్సడ్,రెడ్ లెడ్,క్రోమ్ గ్రీన్,పైన్ ఆయిల్,లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్ ,ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్.
హానికారక మూలకాలు:కోబాల్ట్, మ్యాంగనీస్, డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్,రెడ్ ఆర్సినిక్, జిక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా.
జలాశయాల కాలుష్యంతో తలెత్తే అనర్థాలు..
♦ ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతువుల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది.
♦ పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి,నీరు కలుషిత మౌతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది.
♦ ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను తిన్న వారి శరీరంలోకి హానికారక మూలకాలుచేరుతున్నాయి.
♦ మలేరియా,డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
♦ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి.
ప్రత్యేక కొలనుల్లో నిమజ్జనం ఇలా..
నగరంలో చెరువులు కాలుష్యానికి గురికాకుండా ఉండేందుకు గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకంగా నిర్మించిన 23 ప్రత్యేక నిమజ్జన కొలనులు మరో 17 చెరువుల్లో సుమారు 35 వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు బల్దియా అధికారులు తెలిపారు. నెక్నాంపూర్ చెరువు కొలనులో 3,659, దుర్గం చెరువులో 3,608, మల్కం చెరువులో 2,584, రాజేంద్రనగర్ పత్తికుంట కొలనులో 2,667, కూకట్‌పల్లి రంగదామునిచెరువులో 3,214, కుత్బుల్లాపూర్ లింగంచెరువు పాండ్‌లో 2,012, అల్వాల్ కొత్త చెరువులో 2,234 విగ్రహాలను నిమజ్జనం జరిగినట్లు వారు వివరించారు.
త్వరలో పీసీబీ కాలుష్య నివేదిక..
హుస్సేన్‌సాగర్ సహా నగరంలోని 17 ప్రధాన చెరువుల్లో గణేష్ నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగిన రోజులు, నిమజ్జనం పూర్తయిన తరవాత మూడు దఫాలుగా కాలుష్య నియంత్రణమండలి నీటి నమూనాలను సేకరించింది. వీటిని పీసీబీ ప్రయోగశాలలో పరీక్షించి త్వరలో నిమజ్జన కాలుష్యంపై నివేదిక విడుదల చేయనున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment