
సాక్షి,సిటీబ్యూరో: బుడిబుడి నడకల ప్రాయం బాలలు ‘బొద్దు’గా ఉంటే ఎంత బాగుంటుందో కదూ..! ఇలాంటి వారు ఎంత ముద్దొస్తారో! తల్లిదండ్రులు కూడా ఒకరి పిల్లలను చూసి మరొకరు బలం వస్తుందని.. అతిగా తినిపిస్తుంటారు. ‘బాగా తిని బాగా చదువుకో’.. అని నూరిపోస్తుంటారు. మీ ఇంట్లోని పిల్లలను ఇలాగే చూస్తున్నట్టయితే ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే తిండి.. చదువు తప్ప ఆరుబైట ఆటల ధ్యాస లేకుండా చేస్తే పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల గ్రేటర్ లోని పిల్లలపై చేసిన అధ్యయనంలో ఈ సమస్య తీవ్రతను గుర్తించారు. గ్రేటర్ పరిధిలో పలు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆటపాటకు దూరం కావడం.. గంటల తరబడి తరగతి గదుల్లో పుస్తకాలు, హోమ్‌వర్క్‌తో కుస్తీ పడుతుండడంతో ‘ఒబెసిటీ’ బారిన పడుతున్నారని ‘పీడియాట్రిషియన్స్ అసోసియేషన్’ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. మహానగరం పరిధిలో సుమారు 15 శాతం మంది చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు 10 గంటలకు పైగా వారు తరగతి గదుల్లో బందీ అవడం.. పాఠశాల వేళలు ముగిశాక కూడా ట్యూషన్లు, ఇండోర్ గేమ్స్‌కే పరిమితం కావడంతో ఈ సమస్య తీవ్రమవుతోందని తేలింది.
పెరుగుతున్న బాధితులు
చిన్నారుల్లో రోజురోజుకూ ఊబకాయం పెరగడంతో వారిలో బద్ధకం పెరగడం.. చదువులో ఏకాగ్రత లోపించడం, కడుపు నొప్పి, జీర్ణకోశ, అజీర్ణం వంటి సమస్యలు పదేళ్లలోపు వారిలోనూ కనిపిస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ప్రధానంగా పిల్లలు రోజులో సుమారు 8–10 గంటల పాటు తరగతి గదులకే పరిమితం అవుతుండడం.. చాలా పాఠశాలల్లో విద్యార్థులు స్వేచ్ఛగా ఆడుకునేందుకు అవసరమైన ఆటస్థలాలు లేవు. ఇంటికి వచ్చిన తరవాత కూడా హోమ్‌వర్క్‌లు, ట్యూషన్ల పరిమితం అవడం, జంక్‌ఫుడ్స్ అధికంగా తీసుకోవడం.. సమస్యను మరింత పెంచుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
‘డి’ విటమిన్‌లోపమే ప్రధాన సమస్య
ఊబకాయంతో బాధపడుతోన్న చాలామంది చిన్నారులకు ‘డి’ విటమిన్ లోపం ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి నుంచి లభించే ‘డి’ విటమిన్ పిల్లలకు అందకపోవడంతో త్వరగా ఊబకాయం బారినపడుతున్నారని తేల్చింది. మరోవైపు తల్లిదండ్రులు అధిక క్యాలరీలు ఉండే జంక్‌ఫుడ్స్, కార్భోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను నిత్యం పెడుతుండడంతో సమస్య మరింత పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నుంచి వచ్చిన చిన్నారులను బలవంతంగా ట్యూషన్లు, హోమ్‌వర్క్‌ల ఒత్తిడి లేకుండా కనీసం గంట పాటు ఆరుబయట ఆడుకునే అవకాశం కల్పిస్తే అనారోగ్య సమస్యల నుంచి వారికి విముక్తి లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇలా చేయడం ఉత్తమం..
చిన్నారులకు ఉదయం, సాయంత్రం వేళల్లో రెండుగంటల పాటు విధిగా ఆటవిడుపు ఉండాలి. జంక్‌ఫుడ్‌కు బదులు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, పండ్లు,నట్స్ వంటివి అందించాలి. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ సమయంలో జంక్‌ఫుడ్‌ను దూరంగా ఉంచాలి. బలవంతంగా తరగతి గదులు, ట్యూషన్ల పేరుతో గంటల తరబడి నాలుగు గోడల మధ్య బంధించవద్దు. ఊబకాయంతో చిన్నారుల్లో రోగనిరోధక శక్తి సైతం తగ్గుతుంది. త్వరగా జబ్బుల బారిన పడతారని తల్లిదండ్రులు గుర్తించాలి. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యుడు