వంట వండేద్దాం.. | Training In Cooking For Childrens In Hyderabad | Sakshi
Sakshi News home page

వంట వండేద్దాం..

Published Wed, Jul 25 2018 12:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Training In Cooking For Childrens In Hyderabad - Sakshi

మన హైదరాబాద్‌ బిర్యానీలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న వంటకాల్లో శిక్షణనిస్తోంది జూబ్లీహిల్స్‌లోని ‘ది కలినరీ లాంజ్‌’. అత్యాధునికంగా ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌ థియేటర్‌లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వంటలు నేర్పిస్తున్నారు. కుకింగ్‌పై ఆసక్తి ఉన్నవారు ఇక్కడికొచ్చి గరిట తిప్పడం నేర్చుకుంటున్నారు.   

హిమాయత్‌నగర్‌: సిటీకి చెందిన బైలుప్పల గోపీకిషోర్‌కు చెఫ్‌లంటే అమితమైన అభిమానం. కేవలం వంటరూమ్‌కే పరిమితమవుతున్న చెఫ్‌లను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న గోపీ.. ‘ది కలినరీ లాంజ్‌’ పేరుతో జూబ్లీహిల్స్‌లో కిచెన్‌ థియేటర్‌ ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా పేరొందిన దాదాపు 350 మంది చెఫ్‌లను సంప్రదించాడు. వీరందరితో ఓ సమావేశం ఏర్పాటు చేసి.. పిల్లలు, పెద్దలకు వంటలో శిక్షణనివ్వాలని, కొత్త రుచులు పరిచయం చేయాలని కోరాడు. ఈ ఐడియా నచ్చడంతో వారందరూ ఒప్పేసుకున్నారు. 50 మంది మాస్టర్‌ చెఫ్‌లు, 70 మంది ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌లు, 230 మంది చెఫ్‌లు ఈ కిచెన్‌ థియేటర్‌లో శిక్షణనిస్తున్నారు. ఇక్కడ వంట నేర్చుకోవాలని అనుకుంటే ‘ది కలినరీ లాంజ్‌’ ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వెబ్‌సైట్‌ల ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని గోపీ కిషోర్‌ తెలిపారు.  

పిల్లలకు ప్రత్యేకం...  
7–14 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వంట నేర్పిస్తారు. దీనికి ముందుగా డెమో నిర్వహిస్తారు. డెమో తర్వాత పిల్లలు ఎవరికి వారుగా నచ్చిన వంట చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 300 మంది చిన్నారులు ఇక్కడ శిక్షణ తీసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. గృహిణులు, ఉద్యోగులు, వృద్ధులు సైతం ఇక్కడ వంట నేర్చుకుంటున్నారు. వీరికి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శిక్షణనివ్వడంతో పాటు సెమినార్‌లు నిర్వహిస్తున్నారు. ఐటీ ఉద్యోగులూ వంటపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. శని, ఆదివారాల్లో వీరు ఇక్కడికొచ్చి వంట నేర్చుకుంటున్నారు. విదేశీయులు సైతం ప్రత్యేక వంటకాల్లో శిక్షణ తీసుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. 

ఫీజు ఇలా...   
పిల్లలకు ఐదు వారాలు బేసిక్స్‌ నేర్పిస్తారు. ఇందుకుగాను రూ.5 వేలు చెల్లించాలి. అడ్వాన్స్‌ కోర్సులో బేకింగ్, కుకింగ్‌ నేర్పిస్తారు. దీనికి రూ.15 వేలు. ఇక పెద్దలకు రూ.2,500, విదేశీయులకు రూ.3 వేలు.

దేశంలోనే ఫస్ట్‌...  
ఈ తరహా కిచెన్‌ను మన దేశంలో మేమే ప్రారంభించాం. చెఫ్‌లకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేశాను. పల్లె వంటకాలనూ ఇక్కడ పరిచయం చేయనున్నాం. అంతర్జాతీయ చెఫ్‌లతోనూ  సంప్రదింపులు జరుపుతున్నాం.  – గోపీకిషోర్, ఫౌండర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement