సాక్షి, షాద్‌నగర్: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ అత్యాచారం, హత్యకేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్ కోర్టు విచారణ చేపట్టింది. నిందితులను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరుగనున్న నేపథ్యంలో పోలీసులు షాద్‌నగర్ కోర్టుకు చేరుకున్నారు. 784 / 2019 క్రైమ్ నెంబరులో నిందితులను విచారించాలని పోలీసులు పిటిషన్‌లో కోరారు. అదే విధంగా ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని పేర్కొన్నారు. విచారణలో భాగంగా... నిందితుల దగ్గర నుంచి మరింత సమాచారం తెలుసు కోవాల్సిఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దిశ కేసులో నిందితులను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించే రోజు వేలాది మంది పోలీస్ స్టేషనుకు చేరుకోవడంతో నిందితుల నుంచి పూర్తి వివరాలు తీసుకోలేదని తెలిపారు. కాబట్టి పది రోజులు కస్టడీకి అనుమతి ఇస్తే వారిని మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. ఘటనలో మిస్సయిన మొబైల్ ఫోన్ రికవరీ చేయాల్సి ఉందని.. అదే విధంగా నిందితుల స్టేట్మెంట్ రికార్డు చెయ్యాల్సి ఉందని పిటిషన్‌లో వెల్లడించారు.
కాగా కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో నిందితుల కస్టడీపై కోర్టు తన నిర్ణయం వెల్లడించనుంది. ఇదిలా ఉండగా... కోర్టు వద్ద న్యాయవాదులంతా దిశకు మద్దతు తెలిపారు. షాద్‌నగర్, మహబూబ్‌నగర్‌లో ఏ న్యాయవాది కూడా నిందితులకు న్యాయ సహాయం చేయకూడదని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఫర్ దిశకు ప్రతి ఒక్క న్యాయవాది మద్దతు ఇవ్వాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment