బెస్ట్‌ పోలీస్‌ మనమే! | Hyderabad Kothwal Anjani Kumar Honored Best Police With Memos | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ పోలీస్‌ మనమే!

Published Wed, May 13 2020 9:10 AM | Last Updated on Wed, May 13 2020 9:10 AM

Hyderabad Kothwal Anjani Kumar Honored Best Police With Memos - Sakshi

సిబ్బందికి జ్ఞాపికను అంజేస్తున్న సీపీ అంజనీకుమార్, చిత్రంలో షికా గోయల్‌

హిమాయత్‌నగర్‌: ‘జనతా కర్ఫ్యూ, నైట్‌ టైం కర్ఫ్యూ, లాక్‌డౌన్, ప్రైమరీ కాంటాక్ట్, సెకెండరీ కాంటాక్ట్‌ వెరిఫికేషన్, గాంధీ, కింగ్‌కోఠి, వివిధ చెక్‌పోస్టుల వద్ద విధులు, పోలీసు స్టేషన్‌ నిర్వహణ’లో మన హైదరాబాదీ పోలీసు దేశవ్యాప్తంగా ది బెస్ట్‌ అనిపించుకుందని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైప్పటి నుంచి పురుషులతో సమానంగా మహిళా పోలీసులు సైతం అన్ని విధులను నిర్వర్తిస్తూ సత్తా చాటుతున్నారని సీపీ కితాబిచ్చారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో విధులు నిర్వర్తిస్తున్న లేడీ కానిస్టేబుల్స్‌తో ‘చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలుపకురా’ అనే పాటకు నృత్యం చేయిచి తీసిన వీడియో ద్వారా అవగాహన కల్పించారు. నూతనంగా రూపొందించిన వీడియోను మంగళవారం బషీర్‌బాగ్‌లోని కమిషనర్‌ కార్యాలయంలో అంజనీకుమార్‌ అడిషినల్‌ సీపీలు (క్రైం) షికా గోయల్, అడిషినల్‌ సీపీ (లా అండ్‌ ఆర్డర్‌) చౌహాన్, ఎస్‌బీ జాయింట్‌ సీపీ తరుణ్‌జోషిలతో కలసి రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... కోవిడ్‌–19ను నియంత్రించే పనిలో మన పోలీసు నూటికి నూరుశాతం విధులు నిర్వర్తించడాన్ని అభినందిస్తున్నామన్నారు.

ముంబయి, ఢిల్లీ, బెంగుళూరు, అహ్మదాబాద్, పూణే వంటి నగరాల కంటే మన హైదరాబాద్‌లోనే లాక్‌డౌన్‌ సక్రమంగా, విజయంతంగా అమలవడానికి కారణంగా పోలీసులేనన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో సైతం ఉమెన్‌ పోలీస్‌ బాధ్యతగా విధులు చేయడం గర్వంగా ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసు స్టేషన్‌ మొత్తాన్ని ఒక ఉమెన్‌ కానిస్టేబుల్‌ రన్‌ చేయడం అత్యంత ఆనందదాయకమైన విషయంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటువంటి ఉమెన్‌ పోలీస్‌ను సత్కరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. షికా గోయల్‌ మాట్లాడుతూ... జండర్‌ అనేది ప్రాముఖ్యం కాదనే విషయం మా ఉమెన్‌ స్టాఫ్‌ని చూస్తుంటే అర్థం అవుతుందన్నారు. మెన్‌కు పోటీగా గంటల కొద్దీ విధులు నిర్వర్తిస్తూ ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేస్తుండటం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ‘వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ పోలీసింగ్‌ ఇన్‌ ది కంట్రీ’ అంటూ కొనియాడారు. అనంతరం సాంగ్‌ని రూపొందించిన డైరెక్టర్‌ అరుణ్‌ విక్కిరాల, ప్రోగ్రాం డిజైనర్‌ రవీంద్రారెడ్డి మేడపాటి, కొరియోగ్రఫర్‌ విశ్వారఘు, డ్యాన్స్‌ అసిస్టెంట్‌ విశాల్, సినీమాటోగ్రఫీ నిశాంత్‌ గోపిశెట్టి, అసోసియేట్‌ కెమెరామెన్‌ ఫణీంద్ర, వీడియోలో డ్యాన్స్‌ చేసిన కానిస్టేబుల్స్, కమిషనరేట్‌ పరిధిలోని విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్స్‌కి సీపీ మొమెంటోలు, బ్యాగులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ సీపీ (ఈస్ట్‌ జోన్‌) రమేష్‌రెడ్డి, డీసీపీ (హెడ్‌ ఆఫీస్‌)గజరావు భోపాల్, అడిషినల్‌ డీసీపీ సునితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గర్వంగా ఉంది
చరిత్రలో మళ్లీ ఈ లాక్‌డౌన్‌ పరిస్థితి మళ్లీ రాకపోవచ్చు. కోవిడ్‌–19 నివారణలో ఒక లేడీ కానిస్టేబుల్‌గా బాధ్యతగా విధులు నిర్వర్తించడం మాకు గర్వకారణమనే చెప్పొచ్చు. రోజూ పీఎస్‌ నుంచే కాకుండా డయల్‌–100 నుంచే వచ్చే కాల్స్‌ని సైతం రిసీవ్‌ చేసుకుంటూ అప్పటికప్పుడే పరిష్కరించడం కొత్త అనుభూతినిస్తుంది. హెల్మెట్‌ లేని వారిని, త్రిబుల్‌ డ్రైవింగ్, మాస్క్‌లేని వారిని, ఫిజికిల్‌ డిస్టెన్స్‌ పాటించని వారిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధారంగా గుర్తించి మా ఎస్‌ఐలను అలర్ట్‌ చేస్తూ.. పాటించని వారికి అవగాహన కల్పించడం ఆనందంగా ఉంది. ఇదంతా మా సీపీ సర్‌ వల్లనే సాధ్యమవుతోందని చెప్పేందుకు ఎంతో గర్వంగా ఉంది.    – ప్రీతి, కానిస్టేబుల్, కర్మన్‌ఘాట్‌ పీఎస్‌

వలస కార్మికులను తరలించడం ఆనందంగా ఉంది
ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా ఉండిపోయిన వలస కార్మికులను గుర్తించి తిరిగి వారి స్వస్థలాలను పంపిస్తుండటం ఆనందంగా అనిపిస్తుంది. వారికి ఫిజికల్‌ డిస్టెన్సింగ్‌ అంటే ఏంటీ అనేది వివరిస్తూ.. వారు పాటించేలా చేస్తున్నా. దూరంగా ఉండి మాట్లాడమంటుంటూ తెలియక వాళ్లు బాధ పడుతున్నారు. ఆ సమయంలో దూరం ఎందుకు ఉండాలి అనే విషయాన్ని వివరిస్తూ.. వారికి అవగాహన కల్పిస్తున్నా.     – నిఖిత, కానిస్టేబుల్, అఫ్జల్‌గంజ్‌ పీస్‌

అనుమానం వస్తే కాల్‌ చేస్తున్నారు
ఎవరైనా కాస్త నీరసంగా కనిపిస్తే చాలు పీఎస్‌కు లేదా డయల్‌–100కు ఫిర్యాదు చేస్తున్నారు. సంఘటన స్థలానికి వెళ్లి వారిని చూసి వారి వద్దకు వెళ్లి భరోసా ఇస్తున్నాం. కోవిడ్‌ లక్షణాలు ఎలా ఉంటాయి? మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించడాన్ని నా బాధ్యతగా స్వీకరిస్తున్నా. సీపీ, డీసీపీల నుంచి వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవుతూ.. కోన్ని సందర్భాల్లో పీస్‌ మొత్తాన్ని సింగిల్‌ హ్యాండ్‌తో లీడ్‌ చేయడం గర్వంగా అనిపిస్తుంది.– కె.అనూష, కానిస్టేబుల్, కాచిగూడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement