సాక్షి, హైదరాబాద్ : ఎండాకాలం ఇంకా పూర్తిగా మొదలుకానేలేదు.. అప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర రాజధానిలో మార్చి ప్రారంభం నుంచే పగటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు(98.6 ఫారిన్‌హీట్స్). అదే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలనూ నగరవాసులు తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో రేడియేషన్ సూచీ పది పాయింట్ల మేర నమోదవుతోంది.
ఉక్కపోత, వేసవితాపాన్ని తట్టుకునేందుకు ఏసీ లు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం కొద్దిరోజులుగా విపరీతంగా పెరిగింది. దీంతో సిటీలో విద్యుత్ వినియోగం అనుహ్య స్థాయికి చేరింది. సాధారణంగా సాయంత్రం పీక్ అవర్(ఆరు నుంచి పది గంటలు)లో మాత్రమే కనిపించే విద్యుత్ వినియోగం గత కొద్ది రోజులు గా అర్ధరాత్రి తర్వాత కూడా రికార్డ్ స్థాయిలో నమోదవుతోంది.
సాధారణ రోజుల్లో రాత్రిపూట విద్యుత్ వినియోగం 800 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం రాత్రి పూట 1,200 మెగావాట్లకు పైగా విద్యుత్ వినియోగం నమోదు అవుతుండటం గమనార్హం. గ్రేటర్ చరిత్రలో రాత్రి వేళల్లో ఇంత భారీగా విద్యుత్ వినియోగం జరగడం ఇదే ప్రథమమని డిస్కం పేర్కొంది.
పెరిగిన ఏసీలు.. కూలర్లు..
ఒకప్పుడు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధనవంతుల నివాసాల్లోనే కన్పించేవి. ప్రస్తుతం ఇవి ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణం అయ్యాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆయా కంపెనీలు.. బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నాయి. దీనికి తోడు గతంతో పోలిస్తే ఏసీల ధరలు కొంత తగ్గుముఖం పట్టడం, సులభ వాయిదాల పద్ధతుల్లో కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో మధ్యతరగతి వారు వీటి కొనుగోలుకు వెనకాడటం లేదు.
ఇక ఐటీ, అనుబంధ సంస్థలు అర్ధరాత్రి కూడా తెరిచే ఉంటున్నాయి. ఈ సమయంలో ఏసీలు ఆన్‌లో ఉండటం వల్ల కూడా విద్యుత్ వినియోగం పెరగడానికి మరో కారణం. ఆసక్తికర అంశం ఏమిటంటే అర్ధరాత్రి తర్వాత (గది చల్లబడిన తర్వాత) బంద్ కావాల్సిన ఏసీలు.. తెల్లవార్లూ ఆన్‌లోనే ఉండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం..
గ్రేటర్ పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 42 లక్షలు గృహ, ఏడు లక్షలకుపైగా వాణిజ్య కనెక్షన్లు.. చిన్న, మధ్య, భారీ పరిశ్రమల కనెక్షన్లు మరో యాభై వేల వరకు ఉన్నాయి. పగలు నమోదైన ఉష్ణోగ్రతలు రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా చల్లబడటం లేదు. దీంతో ఏసీలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రెట్టింపైంది.
జనవరిలో సగటు విద్యుత్ వినియోగం 34–36 మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉండగా, ప్రస్తుతం అది 54 ఎంయూలకు చేరింది. మార్చి చివరి నాటికి 60–65 ఎంయూలకు చేరుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. అన్ని సబ్‌స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని ఇప్పటికే పెంచాం.
- శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్, సీపీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment