పోలీసుల అదుపులో అమోల్ బాబా.. రికవరీ చేసిన ఆభరణాలు
అతడో దొంగ. పేరు అమోల్ బాబా సాహెబ్ షిండే. మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలోని యశ్వంత్‌నగర్ సొంతూరు. డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇతగాడు లగ్జరీ జీవితాన్ని గడపాలన్న ఆశతో చోరీల బాట పట్టాడు. తెలుగు ప్రజలకు ఆభరణాలంటే మోజెక్కువని తెలుసుకుని హైదరాబాద్‌కు వచ్చాడు. పలుమార్లు స్నాచింగ్‌లు చేసి సొంత ప్రాంతానికి పరిపోయాడు. తిరిగి వచ్చిన ఇతడు పోలీసులకు చిక్కాడు.
సాక్షి, సిటీబ్యూరో: ఐదు నెలల కాలంలో సైబరాబాద్‌లో 17 చైన్ స్నాచింగ్‌లు చేసి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అంతర్రాష్ట చైన్ స్నాచర్ అమోల్ షిండే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతడిని గుర్తించిన పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి కేపీహెచ్‌బీలోని ఓ లాడ్జ్‌లో ఉండగా అరెస్టు చేశారు. ఇతడి నుంచి దాదాపు రూ.15 లక్షల విలువచేసే 47 తులాల బంగారం, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిల, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్, కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావుతో కలిసి శనివారం కమిషనర్ సందీప్ శాండిల్య మీడియాకు వెల్లడించారు.
తెలుగు మహిళలు ఎక్కువ నగలు ధరిస్తారని..
మహారాష్ట్రలోని పర్భానీ జిల్లా యశ్వంత్‌నగర్‌కు చెందిన అమోల్ బాబా సాహెబ్ షిండే తల్లిదండ్రులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేసే సమయంలో వ్యసనాల కారణంగా నేరాలబాట పట్టాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని చైన్ స్నాచింగ్‌లు మొదలెట్టాడు. 2013లో పర్భానీ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడి తొలిసారి జైలుకు వెళ్లాడు. ఏడాది తర్తా జైలు నుంచి విడుదలై ఔరంగాబాద్‌కు మకాం మార్చి వరుసగా నాలుగు స్నాచింగ్‌లు చేసి పోలీసులకు చిక్కాడు. తిరిగి జైలు నుంచి వచ్చాక 2016లో లాతూర్‌లో స్నాచింగ్‌లు చేసి జైలుకెళ్లాడు. ఇదే సమయంలో మరో నేరగాడు సంజయ్ హకాని యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ‘తెలుగు వారు ఎక్కువగా నగలు ధరిస్తార’ని సంజయ్ ద్వారా తెలుసుకున్న ఆమోల్.. జైలు నుంచి విడుదలయ్యాక 2017 ఆగస్టులో అక్కడే ఓ బైక్ కొని హైదరాబాద్‌కు వచ్చాడు. కొన్ని నేరాలు చేశాక మరో బైక్ మార్చి మరికొన్ని నేరాలు చేశాడు.
ఎడమ చేత్తో తెంచేస్తాడు
అమోల్ రెక్కీ నిర్వహించి స్నాచింగ్‌కు పాల్పడేవాడు. ఒంటరిగా మహిళలు గుడికి, షాపులకు, మార్కెట్‌కి వెళ్లే సమయంలో వారికి ఎదురుగా వచ్చి ఎడమ చేత్తో చైన్ స్నాచింగ్ చేస్తాడు. ఇలా కేపీహెచ్‌బీలో ఐదు, మియాపూర్‌లో మూడు చోరీలు చేసి పర్భానీ వెళ్లిపోయాడు. మళ్లీ సిటీకి వచ్చి కేపీహెచ్‌బీలో మూడు, మియాపూర్‌లో ఒకటి స్నాచింగ్ చేసి మళ్లీ వెళ్లిపోయాడు. తిరిగి జనవరి 6న కేపీహెచ్‌బీకి వచ్చి గాయత్రి లాడ్జ్‌లో దిగి మియాపూర్‌లో రెండు, చందానగర్‌లో ఒకటి, కేపీహెచ్‌బీలో రెండు చైన్ స్నాచింగ్‌లు చేశాడు. అయితే సీసీటీవీ ఫుటేజీలకు చిక్కిన దృశ్యాల ఆధారంగా నిందితుడు అమోల్ షిండేను గుర్తించిన పోలీసులు అతడి కోసం పర్భానీకి కూడా వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి గాయత్రి లాడ్డిలో ఉన్నాడని తెలుసుకుని పట్టుకున్నారు. ఇతడిపై ఔరంగాబాద్, లాతూర్‌లో పెండింగ్ వారంట్లు ఉండడం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 28 చైన్ స్నాచింగ్‌లు చేయడంతో పీడీ యాక్ట్ ప్రయోగించనున్నారు. స్నాచర్‌ను పట్టుకునేందుకు కృషిచేసిన డీసీపీ జానకి షర్మిల, కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధీర్, కానిస్టేబుల్ అనిల్‌ను సైబరాబాద్ సీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment