
హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ‘సదర్’ ఉత్సవాలకు నగరం సన్నద్ధమైంది. ఏటా దీపావళి మరుసటి రోజు నిజాంల కాలం నుంచి ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదకు నిదర్శనంగా సాగే ఈ సంబరం గురువారం ఖైరతాబాద్‌లోను, శుక్రవారం నారాయణగూడ వైఎంసీఏ వద్ద వేడుకలు జరగనున్నాయి. వేడుకల్లో బలిష్టమైన, శక్తివంతమైన దున్నలను ప్రదర్శించనున్నారు. మరోవైపు నగర శివార్లలోనూ సదర్ ఘనంగా నిర్వహించేందుకు యాదవ సమాఖ్యలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: వైవిధ్యభరితమైన హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే సదర్ ఉత్సవాలకు నగరం సన్నద్ధమైంది. నిజాం నవాబుల కాలం నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు యాదవుల ఐక్యతకు, పాడిపంటలు, పశు సంపదకు నిదర్శనం. ఏటా దీపావళి మరుసటి రోజు సదర్ వేడుకలను నిర్వహిస్తారు. ఖైరతాబాద్‌లో ఈ నెల 8న, నారాయణగూడ వైఎంసీఏ ఈ నెల 9న వద్ద వేడుకలు జరుగనున్నాయి. అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటారు. మరోవైపు నగర శివార్లలోనూ సదర్ ఘనంగా నిర్వహించేందుకు యాదవ సమాఖ్యలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ వేడుకల్లో బలిష్టమైన, శక్తివంతమైన దున్నలను ప్రదర్శించనున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా దేశంలోనే బాగా పేరొందిన దున్నలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్‌కే పరిమితమైన సదర్ ఉత్సవం ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో సైతం నిర్వహిస్తున్నారు.ఎంతో వైవిధ్యంతో, అబ్బురపరిచే దున్నల విన్యాసాలతో కనులపండువగా జరిగే ఈ వేడుకలు పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటాయి. యువత కేరింతలు, హోరెత్తించే నినాదాలు, ఆనందోత్సాహాల నడుమ తెల్లవారు జాము వరకు నిర్వహిస్తారు.
సదర్ ఉత్సవాల నేపథ్యం...
హైదరాబాద్‌లో ఎలాంటి ఐక్యత లేకుండా కేవలం పశుపోషణే జీవనాధారంగా చేసుకొని బతికే గొల్ల, కుర్మలను ఐక్యం చేసిన పండుగ ఇది. వారి మధ్య బంధుత్వాలను, స్నేహాన్ని పెంచింది. చౌదరి మల్లయ్య యాదవ్ ఈ ఉత్సవాలకు ఆద్యుడు. సుమారు 75 ఏళ్ల క్రితం నగరంలోని యాదవులందరినీ సంఘటితం చేసేందుకు ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లు అఖిలభారత యాదవ సమాజం తెలిపింది. అత్యధికంగా పశువులను పెంచుతూ, వాటిని ఎంతో జాగ్రత్తగా పోషిస్తూ పేరు ప్రతిష్టలను తెచ్చుకున్న యాదవులను ‘సదర్’గా గౌరవించే సంప్రదాయం ఇది. సదర్ అంటే ప్రముఖులు. పెద్దవారు అని అర్థం. అలా ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ వేడుకలో బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ నిజాం కాలంలోనూ ఏడాదికోసారి గొల్లలు కలుసుకొనేవారని, తమ పశుసంపదను గురించి చర్చించుకొనేవారని చెబుతారు. మరోవైపు పురాణాల్లోనూ సదర్‌కు ఒక స్థానం ఉంది. ద్వాపర యుగంలో శ్రీకష్ణుడు ఓ సారి ఇంద్రుడిని పరిహసిస్తాడు. కోపంతో ఇంద్రుడు యాదవులపై కుంభవృష్టి కురిపిస్తాడు. దీంతో యాదవులంతా ఆందోళన చెందుతారు. శ్రీకష్ణుడు తన లీలలను ప్రదర్శించి తన చిటికెన వేలితో గోవర్ధనగిరిని పైకెత్తి గోవులను, గోపబాలురను రక్షిస్తాడు. యాదవులకు శ్రీకష్ణుడు చేసిన సేవలను స్మరించుకుంటూ... ఆయనకు ఎంతో ఇష్టమైన గోవులను అందంగా అలంకరించి ఒక దగ్గరికి తెచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.
దారా దున్నపోతు విన్యాసం
ఎల్లారెడ్డిగూడలో...
శ్రీనగర్‌కాలనీ: ఎల్లారెడ్డిగూడలో గురువారం రాత్రి నిర్వహించే సదర్ ఉత్సవాలకు దున్నపోతులను రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదర్ ఉత్సవాలకు మంగళవారం ఎల్లారెడ్డిగూడలో శక్తి, భీం అనే దున్నపోతులను ఎన్.మల్లేష్‌యాదవ్ సన్నద్ధం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దున్నపోతుకు రోజూ 10 లీటర్ల పాలు, యాపిల్స్, ఎండు కర్జూరాలు, ఉలవలలో పాటు పౌష్టికాహాన్ని తినిపిస్తున్నామని ఆయన తెలిపారు. పీఎస్‌ఆర్ క్షీరధార నుంచి రెండు దున్నపోతులను తెచ్చామన్నారు.దేశీయ మేలిరకం దున్నపోతులన్నారు సుమారు 1500 కిలోల బరువు ఉంటాయని చెప్పారు. గురువారం రాత్రి యాదవులతో పాటు అన్ని సామాజిక వర్గాలు సంఘటితమై సదర్‌ను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. దశాబ్దాలుగా సదర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. గోపూజతో పాటు డప్పులు, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సదర్ ఉత్సవాలకు ప్రతిఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఉప్పరిగూడ సదర్‌కు ప్రాధాన్యం
చంచల్‌గూడ: పాతబస్తీలోని కుర్మగూడ డివిజన్ ఉప్పరిగూడ, చావణి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సదర్ ఉత్సవాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రాంతంలో నిజాం కాలం నుంచి సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీ నుంచే కాక రంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన యాదవులు ఇక్కడి సదర్ ఉత్సవంలో తమ దున్నలతో పాల్గొంటారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో చంచల్‌గూడ మెయిన్ రోడ్డుపై వేదిక ఏర్పాటు చేసి సదర్‌లో పాల్గొన్న దున్నల యజమానులను సత్కరిస్తారు.
సత్తర్‌బాగ్‌లో సందర్శకుల సందడి
ముషీరాబాద్: హర్యాన రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన దున్నపోతులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని స్పెన్సర్స్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న సత్తర్‌బాగ్‌లో సేదతీరుతున్న దున్నలను చూసేందుకు ముషీరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. దున్నల బలిష్టమైన దేహం, చూపు తిప్పుకోనివ్వని రూపు, కళ్లు చెదిరే విన్యాసాలు, చూడడానికి రెండు కళ్లు చాలవు అన్నట్లు ఉన్న ఈ దున్నలతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. బీబీసీ, ఎఎన్‌ఐ వంటి వార్తా చానళ్లతోపాటు జాతీయ, రాష్ట్ర మీడియా చానళ్లు వాటిని కెమెరాలలో బంధించేందుకు పోటీ పడుతున్నాయి. శరీరానికి తగ్గట్లే భారీగానే తిండి... దున్నల ఆలనాపాలన చూసేందుకు ముగ్గురు పని చేస్తున్నారు. గత ఏడాది వేడుకల్లో షహన్‌షా, యువరాజులు ఆకట్టుకుంటే ఈ సారి వాటితో పాటు యువరాజుకే పుట్టిన దారా ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. దారాతో పాటు మరో రెండేళ్ల దున్న కాలా కూడా బుధవారం నగరానికి రానుంది. సుమారు వేయి నుంచి 1200 కేజీల బరువు ఉండే ఈ దున్నపోతులు ఆరడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు ఉన్నాయి. నిత్యం వాటికి రూ. 6 వేలకుపైనే ఖర్చు అవుతుందంటున్నారు నిర్వాహకులు. రోజూ 4 నుంచి 5 కిలోమీటర్ల వాకింగ్ చేస్తుంటాయి.
దున్న@: రూ. 7 కోట్లు
రసూల్‌పురా: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం కంటోన్మెంట్ అన్నానగర్‌లో యాదవ సంఘం నాయకులు సదర్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు రూ. 7 కోట్ల విలువ చేసే దున్న (షహెన్‌షా)ను తీసుకొచ్చారు. ఆ దున్నను తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాదవ సంఘం నాయకుడు వెంకట్‌యాదవ్ మాట్లాడుతూ... అన్నానగర్‌లో మొట్టమొదటిసారి సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.వెంకటేష్, జి.వెంకట్‌యాదవ్, సాయి యాదవ్, పి.రవియాదవ్, ఎన్.రాజుయాదవ్, ఎం.శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment