సాక్షి,సిటీబ్యూరో: నారాయణగూడలోని వైఎంసీఏ చౌరస్తాలో శుక్రవారం నిర్వహించనున్న సదర్ ఉత్సవ్ మేళా నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి 7గంటల నుంచి శనివారం తెల్లవారుజాము 5గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
♦ కాచిగూడ చౌరస్తా నుంచి వైఎంసీఏ వైపు వాహనాలను టూరిస్ట్ హోటల్ మీదుగా, విఠల్‌వాడీ చౌరస్తా నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రామ్‌కోఠి చౌరస్తా వైపు, రాజ్‌మొహల్లా వైపు నుంచి రామ్‌కోఠి వైపు వచ్చే వాహనాలను సబో షాప్ పాయింట్ మీదుగా, రెడ్డి కాలేజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను బర్కత్‌పురా వైపు, ఓల్డ్ బర్కత్‌పురా పోస్టాఫీస్ నుంచి వచ్చే వాహనాలను క్రౌన్ కేఫ్ వైపు, పాత ఎక్సైజ్ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాహనాలను విఠల్‌వాడీ వైపు, బర్కత్‌పురా చమన్ వైపు నుంచి వచ్చే వాహనాలను బర్కత్‌పురా చౌరస్తా లేదా టూరిస్ట్ హోటల్ వైపు, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి రెడ్డి కాలేజ్ వైపు వచ్చే వాహనాలను నారాయణగూడ చౌరస్తా వైపు మళ్లిస్తారు.
ఖైరతాబాద్: నగరంలో సదర్ ఉత్సవాలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. దున్నపోతుల విన్యాసాలు అబ్బురపరిచాయి. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ఉత్సవాలను వీక్షించేందుకు సిటీజనులు తరలొచ్చారు. ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్ నేత దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ... పార్టీలకు అతీతంగా సదర్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంగళారపు చౌదరి సత్తయ్య యాదవ్ అండ్ బ్రదర్స్, నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎం.యాదయ్య, ఎం.లక్ష్మణ్, మహేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పండగగా ప్రకటించాలి...
జూబ్లీహిల్స్: ఎల్లారెడ్డిగూడ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో కమాండో (దున్నపోతు), గౌరీ (గుర్రం) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్వాహకులు గొంటి శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతిలో భాగమైన సదర్‌ను రాష్ట పండగగా ప్రకటించాలని కోరారు. సందీప్ యాదవ్, సాయినాథ్ యాదవ్, శివనాథ్ యాదవ్, శ్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు.
రూ.9 కోట్ల విరాట్...
మారేడుపల్లి: మారేడుపల్లిలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో రూ.9కోట్ల విలువైన హర్యానా దున్నపోతు (విరాట్) సందడి చేసింది. విరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి వీధుల్లో ఊరేగించారు. వెస్ట్ మారేడుపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఉత్సవాలు నిర్వహించగా... దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యాదవ సంఘం నేతలు కిట్టు యాదవ్, అశోక్‌యాదవ్, సన్నీ యాదవ్, బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment