ప్రేమ కోసమై చెరలో పడెనే.. | Hyderabad Techie Arrested In Pakistan : CP Sajjanar Consoled His Father | Sakshi
Sakshi News home page

ప్రేమ కోసమై చెరలో పడెనే..

Published Wed, Nov 20 2019 2:49 AM | Last Updated on Wed, Nov 20 2019 2:49 AM

Hyderabad Techie Arrested In Pakistan : CP Sajjanar Consoled His Father - Sakshi

ప్రశాంత్‌ తండ్రి బాబూరావును ఓదారుస్తున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

కేపీహెచ్‌బీకాలనీ : మధ్యప్రదేశ్‌కు చెందిన స్వప్నికా పాండేను మనసారా ప్రేమించాడు. బెంగళూరులోని హువాయ్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం రావడంతో స్వప్నిక వెళ్లిపోయినప్పటి నుంచి ఆమెనే తలచుకుంటూ మతిస్థిమితం తప్పాడు. ప్రియురాలు తనను దూరంపెట్టడం భరించలేక ఎలాగైనా చేరుకోవాలని పొరపాటున శత్రుదేశంలో కాలుమోపిన హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రశాంత్‌ పరిస్థితిపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్‌ను పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ప్రశాంత్‌ కుటుంబ నేపథ్యం..
బాబూరావుకు ఇద్దరు కుమారులు కాగా ప్రశాంత్‌ పెద్ద కొడుకు. ప్రశాంత్‌ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే బాబూరావు కుటుంబం శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి విశాఖపట్నంకు వచ్చారు. ఏడేళ్ల క్రితం రెండో కుమారుడు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉండటంతో బాబూరావు కూడా నగరానికి వచ్చి కుమారుడి వద్దనే ఉంటున్నారు. ప్రస్తుతం బాబూరావు భార్య ఇందిర, చిన్న కుమారుడు శ్రీకాంత్, కోడలు కలసి కేపీహెచ్‌బీ భగత్‌సింగ్‌నగర్‌ ఫేజ్‌–1లోని ప్లాట్‌ నంబర్‌ 522లో గల ద్వారకామాయి అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. కాగా, ప్రశాంత్‌కు బెంగళూరులోని హువాయ్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో స్వప్నికా పాండే పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. అదే సమయంలో స్వప్నికకు మరో ఉద్యోగం రావడంతో సిట్జర్లాండ్‌ వెళ్లిపోయింది. ప్రశాంత్‌ కొంతకాలం చైనా, ఆఫ్రికా దేశాల్లో ఉద్యోగ రీత్యా పనిచేశాడు. అక్కడ ఇమడలేక నగరానికి వచ్చి అమీర్‌పేటలో ఫ్యాకల్టీగా కోచింగ్‌ సెంటర్‌లో పనిచేశాడు. తిరిగి షోర్‌ ఇన్‌ఫోటెక్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాడు. అయితే ఎన్ని దేశాలు, ఉద్యోగాలు మారినా స్వప్నికను మరచిపోలేకపోయాడు. దీంతో ఆమె వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మానసిక స్థితి తప్పిన ప్రశాంత్‌ ప్రేయసిని వెదుకుతూ.. ఉత్తర భారత్‌ వెళ్లి ఉంటాడని, ఈ క్రమంలోనే పొరబాటున పాక్‌లోకి ప్రవేశించి ఉంటాడని బాబురావు మంగళవారం మీడియాకు తెలిపారు.

చాలా సున్నిత మనస్కుడు..
సున్నిత మనస్కుడైన ప్రశాంత్‌ ఎప్పుడూ ఆందోళనకు గురవుతూ ఉండేవాడని, ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించేవాడని బాబురావు చెప్పారు. చివరగా 2017, ఏప్రిల్‌ 11న డ్యూటీకని వెళ్లిన ప్రశాంత్‌ ఇంటికి తిరిగిరాలేదన్నారు. దీంతో ప్రశాంత్‌ పనిచేసే సంస్థలో విచారించగా విధులకు వచ్చి వెళ్లినట్లు తెలిపారన్నారు. అంతా వెతికి అదే నెల 29న మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసామన్నారు. ఎక్కడో చోట క్షేమంగా ఉంటాడని భావిస్తూ వచ్చామన్నారు. కానీ, ఇలా పాకిస్తాన్‌లో ఉన్నాడన్న వార్త వింటామని కలలో కూడా ఊహించలేదని కన్నీరుమున్నీరయ్యారు.

ఎనిమిది నెలల కిందట..
8 నెలల కిందట రాజస్థాన్‌ నుంచి ఇద్దరు పోలీసులు, నగరంలోని లక్డీకాఫూల్‌ పోలీసులతో కలసి సివిల్‌ దుస్తుల్లో వచ్చి తన చిన్న కుమారుడు శ్రీకాంత్‌ను ప్రశాంత్‌ వివరాలు అడిగారని బాబురావు చెప్పారు. అప్పుడు వైజాగ్‌లో ఉన్న తమ వద్దకు కూడా వచ్చి కుటుంబ వివరాలు తెలుసుకుని మీ అబ్బాయి క్షేమంగానే తిరిగి వస్తాడని చెప్పి వెళ్లారని తెలిపారు. నెల రోజుల తరువాత మరొకరు పోలీసు అని వచ్చి ప్రశాంత్‌ వివరాలు తెలుసుకుని వెళ్తూ వెళ్తూ మీ అబ్బాయి పాకిస్తాన్‌లో ఉన్నాడని చెప్పి వెళ్లడంతో ఆందోళనకు గురయ్యామని, వెంటనే మాదాపూర్‌ పోలీసులకు సమాచారాన్ని అందించామని తెలిపారు. అయితే పోలీసులు మాత్రం అలాంటి సమాచారమేదీ తమకు లేదని చెప్పినట్లు తెలిపారు.

రెండువారాల క్రితమే సందేశం..
ఈ క్రమంలోనే రెండువారాల కింద పాకిస్తాన్‌లో ఉన్న తమ కుమారుడు కోర్టు ఆవరణలో ఓ న్యాయవాది సహకారంతో ఫోన్‌లో మాట్లాడిన వీడియోను తన సెల్‌కు పంపడంతో తమకు ఏం చేయాలో పాలుపోలేదని వాపోయారు. తాను పాకిస్తాన్‌ ప్రభుత్వ అదుపులో ఉన్నానని, కోర్టు ప్రొసీడింగ్స్‌ అయిన తరువాత తనను భారత ప్రభుత్వానికి అప్పగిస్తారని, నెల రోజుల్లో తిరిగి వచ్చేస్తానని తెలియపర్చినట్లు బాబురావు పేర్కొన్నారు. 

తొలుత సైనిక విచారణ జరిగిందా?
8నెలల క్రితమే పోలీస్‌ అధికారులు బాబూరావు కుటుంబాన్ని విచారించటాన్ని బట్టి అప్పటి నుంచే ప్రశాంత్‌ పాక్‌ చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. సైనిక విచారణ అనంతరం ప్రభుత్వానికి అప్పగించి ఉంటారని, ప్రభుత్వం కోర్టు ద్వారా అభియోగాలను నమోదు చేయటంతో వెలుగులోకి వచ్చిందని భావిస్తున్నారు. నవంబర్‌ 14న ప్రశాంత్‌తోపాటు మధ్యప్రదేశకు చెందిన దరిలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, వాస్తవానికి అతన్ని చాలాకాలం కిందటే అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతని మానసిక పరిస్థితిపై వారికి కూడా స్పష్టత ఉంది కాబట్టే.. అతని వీడియో సందేశం మీడియాకు విడుదల చేశారని, నిజంగానే గూఢచర్యం కేసులో అరెస్టు చేస్తే.. పరిస్థితులు మరోరకంగా ఉండేవని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మంత్రి కేటీఆర్‌ హామీ
ప్రశాంత్‌ పాక్‌ చెరలో ఉన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు.. బాబురావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడి బాబురావుతోనూ మాట్లాడించారు. ప్రశాంత్‌ను క్షేమంగా తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ హామీనిచ్చారు. కాగా, ప్రశాంత్‌ది సాధారణ మిస్సింగ్‌కేసని, క్షేమంగా వస్తాడని, దానిపై ఎలాంటి ఈ విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు.

పాక్‌ మీడియా ఏమంటోందంటే..
పాకిస్తాన్‌లో పంజాబ్‌ ప్రావీన్స్‌లోని తుబాబరిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు ప్రశాంత్, దరియాలాల్‌ (మధ్యప్రదేశ్‌) కనిపించారు. దీంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆ దేశ మీడియా చెబుతోంది. వీరిపై సెక్షన్‌ 3, 4 (కంట్రోల్‌ ఆఫ్‌ ఎంట్రీ) యాక్ట్‌ 1952 ప్రకారం.. బహవాల్‌పూర్‌ జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement