అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుంటే మరోపక్క గులాబీ దళంలో అసంతృప్తి రగులుతోంది. గ్రేటర్ పరిధిలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు.. పార్టీ ఇన్‌చార్జులకు టికెట్లు ప్రకటించినప్పటి నుంచి నిరసన సెగలు మొదలయ్యాయి. అయితే, కొన్ని నియోజకవర్గాల్లో అవి చల్లారగా.. మరికొన్ని చోట్ల రగులుతూనే ఉన్నాయి. ఓ పక్క టికెట్లు ఖరారైన అభ్యర్థులు బస్తీలు, కాలనీల్లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. వారికి వ్యతిరేకంగా అదే పార్టీకి చెందిన వారు ర్యాలీలు తీస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గులాబీ గూటిలో చెలరేగిన అసమ్మతి సెగలు చల్లారడంలేదు. గ్రేటర్ పరిధిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరపున పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లు, పార్టీ ఇన్‌చార్జులకు టిక్కెట్లు ప్రకటించినప్పటి నుంచి మొదలైన అసంతృప్త జ్వాలలు కొన్ని నియోజకవర్గాల్లో చల్లారగా..మరికొన్నింట నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే టిక్కెట్ ఖరారైన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారజోరును పెంచారు. కాలనీలు, బస్తీలు, సంక్షేమసంఘాలతో ఉదయం, సాయంత్రం వేళల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తూ స్పీడు పెంచడం విశేషం. ప్రధానంగా గ్రేటర్ పరిధిలోని ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు సొంతపార్టీ నుంచి తలనొప్పులు మొదలవడం గమనార్హం. ఇప్పటికే టిక్కెట్లు ఖరారైన టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు ఇలా ఉన్నాయి.
ఉప్పల్: పార్టీనియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భేతి సుభాష్‌రెడ్డికి టిక్కెటను ప్రకటించిన విషయం విదితమే. ఆయనపై ఆరుగురు కార్పొరేటర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. వీరిలో జ్యోత్స్య, అనలారెడ్డి, అంజయ్య, సరస్వతి, స్వర్ణరాజ్, దేవేందర్‌రెడ్డిలున్నారు. వీరు ఆయనకు సహకరించేదిలేదని ఇటీవల బహిరంగంగానే ప్రకటించడం గమనార్హం. అయితే ఆయా డివిజన్లలో కొంతమంది కేడర్‌మాత్రం పార్టీ అభ్యర్థి నిర్వహిస్తున్న ప్రచారపర్వంలో చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రచారపర్వాన్ని భేతిసుభాష్‌రెడ్డి హోరెత్తించారు. నియోజకవర్గం నలుమూలల్లో సమావేశాలు, సభలతో ప్రచార స్పీడ్‌పెంచారు.
కుత్బుల్లాపూర్: ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద అభ్యర్థిత్వంపై సానుకూలంగా లేని పార్టీ కార్పొరేటర్లు సత్యనారాయణ, శేషగిరి, జగన్, విజయ్‌శేఖర్‌గౌడ్, పద్మప్రతాప్‌లు 15 రోజులుగా ప్రచార పర్వంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
ఇక మొన్నటివరకు నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న కొలన్ హన్మంత్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని బహిరంగంగా ప్రకటించడం గమనార్హం.
జూబ్లీహిల్స్: ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే..పార్టీ టిక్కెట్ ఖరారైన మాగంటి గోపీనాథ్‌కు కూడా అసమ్మతి సెగలు కునుకులేకుండా చేస్తున్నాయి. కార్పొరేటర్లు మనోహర్, షఫిలు ఆయనకు వ్యతిరేకంగా బహిరంగంగా గళం విప్పగా..అంజయ్యగౌడ్ కూడా నామమాత్రంగా ప్రచారపర్వంలో పాల్గొంటున్నప్పటికీ ఆయన అభ్యర్థిత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో టీఆర్‌ఎస్‌పార్టీ తరపున పోటీచేసిన మురళీగౌడ్ కూడా అసమ్మతి గళం వినిపిస్తున్నారు.
కూకట్‌పల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన పన్నాల హరీశ్‌రెడ్డి టీడీపీ తరపున టిక్కెట్‌కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
టిక్కెట్ దక్కని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు సమాయత్తమౌతున్నట్లు సమాచారం. మిగతా కార్పొరేటర్లు తాజా మాజీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ప్రచారపర్వంలో పాల్గొంటున్నప్పటికీ అసమ్మతి చిక్కులు తప్పవని పార్టీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.
శేరిలింగంపల్లి: ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి టిక్కెట్ ఖరారైన నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో ప్రచారం స్పీడు పెంచారు. తొలుత అసమ్మతి గళం వినిపించిన కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, నాగేందర్‌యాదవ్, రమేష్, సాయిబాబా, వెంకటేశ్‌గౌడ్‌లు తాజా మాజీ మంత్రి కేటీఆర్ సర్దిచెప్పడంతో ఎమ్మెల్యే వెంట ప్రచారం పర్వంలో పాల్గొంటున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలోనూ అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మాల్కాజ్‌గిరీలో వీడని సస్పెన్స్...
మాల్కాజ్‌గిరీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి తమ కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇస్తామని అధినేత నుంచి హామీ లభించినట్లు ప్రచారం చేసుకుంటుండగా..టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనం పల్లి హన్మంతరావు కూడా తనకు టిక్కెట్ కరారైనట్లు జోరుగా ప్రచారం చేసుకుంటుండడంతో పార్టీ క్యాడర్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న కార్పొరేటర్లు జితేందర్, సబితాకిశోర్, జగదీష్‌గౌడ్, ముంతాజ్‌ఫాతిమా, శిరీషారెడ్డి, శ్రీదేవి, పుష్పలతారెడ్డిలు మైనంపల్లి హన్మంతరావుకే తమ మద్దతని ప్రకటించడంతో ఈ నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంలో పడింది.
రాజేంద్రనగర్‌లో..
సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు టిక్కెట్ ఖరారైన నేపథ్యంలో అసంతృప్త నేత శ్రీశైలంరెడ్డి అసమ్మతి గళం వినిపిస్తున్నారు. కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి సైతం ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ప్రచారపర్వంలో పాల్గొనేందుకు ససేమిరా అంటున్నట్లు తెలిసింది.
నాంపల్లి, కార్వాన్‌లలో ఓకే..
ఇక నాంపల్లిలో పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన ఆనంద్‌కుమార్‌గౌడ్, కార్వాన్ అభ్యర్థి జీవన్‌సింగ్‌లపై తొలుత పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తంచేసినప్పటికీ ప్రస్తుతం అసమ్మతి సెగలు చల్లబడినట్లు సమాచారం. దీంతో ఆయా అభ్యర్థులు ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment