సాక్షి, సిటీబ్యూరో : స్వచ్ఛసర్వేక్షణ్–2019 ర్యాంకింగ్‌ల్లో లక్ష జనాభాపైబడిన నగరాల్లో జీహెచ్‌ఎంసీకి 35వ స్థానం లభించింది. మొత్తం 4273 నగరాలతో జరిగిన పోటీలో ఈ ర్యాంకును కైవసం చేసుకుంది. గత సంవత్సరం 4041 నగరాలతో పోటీపడి 27వ స్థానం పొందగా, ఈసారి పెరిగిన నగరాలతోపాటు ర్యాంకు కూడా పెరిగింది. దేశంలోని ఇతర పెద్ద నగరాలైన ముంబై(49వ స్థానం), బెంగళూర్(210వ స్థానం), చెన్నై(61వ స్థానం)ల కంటే హైదరాబాద్ ముందంజలో నిలిచినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మాత్రం మనకంటే ముందుండి 5వ స్థానంలో నిలిచింది. గ్రేటర్ ముంబై గత సంవత్సరం 18వ ర్యాంకు సాధించగా, ఈసారి 49వ ర్యాంకుకు పరిమితమైంది. చెన్నయ్ గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా 61వ ర్యాంకునే కైవసం చేసుకోవడం విశేషం.
బెంగళూర్ ర్యాంక్ గత సంవత్సరం ఉన్న 194 నుంచి ఈసారి 210కి పెరిగింది. 2017లో చిన్న పట్టణాలు, పెద్ద నగరాలు అన్నింటికీ కలిపి స్వచ్ఛ ర్యాంకులు ప్రకటించగా, గత సంవత్సరం నుంచి లక్ష జనాభా మించిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ప్రకటిస్తున్నారు. గత సంవత్సరం సిటిజెన్ ఫీడ్‌బ్యాక్ తగ్గినందునే రావాల్సిన ర్యాంకు రాలేదని భావించి, సిటిజెన్ ఫీడ్‌బ్యాక్ కోసం ఈసారి ఎంతో ప్రచారం చేసినప్పటికీ, గత సంవత్సరం కంటే ప్రజల ఫీడ్‌బ్యాక్ తగ్గింది. గత సంవత్సరం ఈ అంశంలో 1400 మార్కులకు 942 మార్కులు సాధించగా, ఈసారి 1250 మార్కులకు 936 మార్కులు మాత్రమే లభించాయి. స్వచ్ఛ భారత్ బృందం సర్టిఫికేషన్‌కు ఈసారి 1250 మార్కులు కేటాయించగా, ఈ విభాగంలో మన నగరం 600 మార్కులు పొందింది. మొత్తం నాలుగు విభాగాల్లో వెరసి 5000 మార్కులకుగాను జీహెచ్‌ఎంసీ 3455 మార్కులు పొందింది.
తగ్గిన మార్కుల శాతం..
2016లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ నగరానికి 2000 మార్కుల్లో 1355 మార్కులు (67.70శాతం), 2017లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2000 మార్కులకుగాను 1605 (80 శాతం) మార్కులు, 2018లో 4000 మార్కులకుగాను 3,092 మార్కులు (77.30శాతం) లభించగా ఈసారి 5000 మార్కులకుగాను 3455 (69 శాతం మార్కులు) మాత్రమే లభించాయి.
♦ ఈ సంవత్సరం హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోని ఇతర నగరాలైన వరంగల్‌కు 81 ర్యాంకు, కరీంనగర్‌కు 99 వ ర్యాంకు లభించాయి.
♦ స్వచ్ఛ సర్వేక్షణ్ –2019లో మొత్తం నాలుగు విభాగాల్లో 5 వేల మార్కులకు మూల్యాంకనం చేయగా జీహెచ్‌ఎంసీకి 3,455 మార్కులు లభించాయి. హైదరాబాద్‌లో స్వచ్ఛ కార్యక్రమాల అమలుపై నాలుగు విభాగాలకు వేర్వేరుగా 1250 మార్కుల వంతున కేటాయించారు. వీటిలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాలపై నగరవాసులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు 936 మార్కులు, సర్టిఫికేషన్ విభాగంలో అ 600మార్కులు , స్వచ్చ కార్యకమ్రాల అమలుపై స్వచ్ఛ భారత్ ప్రతినిధుల బృందం ప్రత్యక్ష పరిశీలనకు 1,117 మార్కులు లభించాయి. బృందం జీహెచ్‌ఎంసీ అధికారులతో జరిపిన సమావేశాలకు 802 మార్కులు లభించాయి.
మెట్రో నగరాల్లో టాప్
♦ స్వచ్ఛత కార్యక్రమాలో మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాదే టాప్‌లో ఉందని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. దాదాపు కోటి జనాభా ఉన్న హైదరాబాద్ ఇతర మెట్రో నగరాలైన ముంబై, బెంగళూర్, చెన్నయ్, కోల్‌కత్తాల కంటే ముందజలోఉందని, న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) అంటే ఢిల్లీమొ త్తం కాదని పేర్కొంది.
♦ గత సంవత్సరం రాజధాని నగరాల్లో దేశంలోనే ఘనవ్యర్థాల నిర్వహణలో అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్ ఈసారి ఏ ప్రత్యేక అంశంలోనూ చోటు దక్కించుకోలేదు. ఈసారి జాతీయస్థాయిలో క్లీనెస్ట్, ఫాస్టర్ మూవర్, సిటిజెన్ ఫీడ్‌బ్యాక్, ఇన్నొవేటివ్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంశాల వారీగానూ ఆయా కార్పొరేషన్లను ఉత్తమమైనవిగా ఎంపిక చేయగా, హైదరాబాద్‌కు వాటిల్లో స్థానం లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment