నేనేమీ చంద్రబాబును కాదు
వెన్నుపోటు పొడవడానికి: టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు
హైదరాబాద్: తిన్నింటి వాసాలు లెక్కబెట్టడానికి, వెన్నుపోటు పొడవడానికి తానేమీ టీడీపీ అధినేత చంద్రబాబును కాదని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ను చీల్చడానికి, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవడానికి హరీష్ రావు రంగం సిద్ధం చేసుకున్నాడన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలపై ఆదివారం ఆయన ఒక ప్రకటన లో స్పందించారు. పిల్లనిచ్చిన మామ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీలో పనిచేస్తున్న నేతలకు అందరూ వెన్నుపోటుదారుల్లాగానే కనిపిస్తున్నారని విమర్శించారు. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు, వెన్నుపోటు దారుల పార్టీలోని టీడీపీ నేతలకు అందరూ వెన్నుపోటు దారుల్లాగానే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పిచ్చికూతలు ఇలాగే కూస్తే టీడీపీ నేతల నాలుకలు కోస్తానని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌లో చీలిక రాదని, తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జనామోదం లేకున్నా ముఖ్యమంత్రి పదవికోసం అడ్డదారులు వెతుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. అధికారం జారిపోయిందని గ్రహించిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వంటివారు టీఆర్‌ఎస్ చీలుతుందని పగటి కలలు కంటున్నారని అన్నారు. గోబెల్స్ ప్రచారం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చండి: వినోద్
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చి, వరంగల్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖను ఆదివారం పత్రికలకు విడుదల చేశారు.