ఆదివారం సిద్దిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట, వర్గల్ (గజ్వేల్): ‘ప్రత్యేక రాష్ట్రం కావాలన్న వాంఛ యావత్ తెలంగాణ ప్రజలది. వారి ఆలోచన మేరకే రాష్ట్రం సాధించుకున్నాం. రాష్ట్ర సాధనలో సబ్బండ వర్ణాలు కలిసికట్టుగా వచ్చాయి. మీరిచ్చిన స్ఫూర్తితోనే ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముందు నడిచి తెలంగాణ రాష్ట్రం తెచ్చాడు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభి వృద్ధి చేసుకునేందుకు అధికారం కోసం పాకులాడే నాయకులుగా కాకుండా.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గం, గజ్వేల్ నియోజ కవర్గంలోని వర్గల్‌లో ఎన్నికల ప్రచారసభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యను తీర్చారన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ, కోతలు లేని విద్యుత్‌ను సరఫరా చేస్తున్న రాష్ట్రాన్ని చూసి దేశంలో ఇతరరాష్ట్రాలు నివ్వెరపోతున్నాయని పేర్కొన్నారు. ఇల్లులేని ఉండకూడదనే కేసీఆర్ ఆలోచనతోనే డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నామని, సొంతస్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ప్రభుత్వసా యమందించి ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహిస్తామన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక...
ఇంతకాలం మన ప్రాంతాన్ని దోచుకోవడం మరిగిన ఏపీ నేతలకు ఇంకా దాహం తీరలేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటే చూసి ఓర్వలేని చంద్రబాబునాయుడు తిరిగి మనపై పెత్తనం చేసేందుకు తహతహలాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టడాన్ని చూసి భయపడ్డ కాంగ్రెస్ ఒంటరిగా పోటీకి భయపడి తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుందన్నారు. పొత్తు సాకుతో రాష్ట్రంలో బాబు తిష్ట వేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు మహాకూటమి వెనక బాబు కుట్రను పసిగట్టారని, అప్పుడు ఉద్యమంతో బాబును ఏపీకి పంపినట్లే ఇప్పుడు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోనియాది తెలంగాణలో ఆంధ్రపాటని విమర్శించారు.
‘రైతుబంధు’ రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ను రద్దు చేయాలి
గతంలో తెలంగాణలో రైతులు సాగునీటి కోసం ఆకాశం వైపు.. పెట్టుబడి కోసం షావుకార్ల వద్దకు తిరిగే పరిస్థితి ఉందని హరీశ్‌రావు అన్నారు. దీనిని స్వయంగా అనుభవించిన రైతు బిడ్డగా కేసీఆర్ ఆలోచన చేసి పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. రైతుల బతుకులతో అనుబంధం ఉన్న రైతుబంధు పథకం రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుబంధును రద్దు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీనే రద్దు చేయాలని, అందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తీరే రోజులు దగ్గర పడుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకుందని తెలిపారు. పాలమూరు ప్రాంతంలో కృష్ణా, తుంగభద్ర నదుల నీరు వ్యవసాయానికి అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు.
నోట్ల కట్టలకు అమ్ముడుపోతమా..
‘కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబునాయుడు పంపిన నోట్ల కట్టలు తెచ్చి మనల్ని కొంటరట. నోట్ల కట్టలకు మనం అమ్ముడుపోతమా. మనకు ఆత్మగౌరవం లేదా. చంద్రబాబు నోట్ల కట్టలు గెలవాల్నా. తెలంగాణ ఆత్మగౌరవం గెలవాల్నా ఆలోచించుకోవాలి’అని హరీశ్‌రావు అన్నారు. నోట్ల కట్టలుంటే ఇంట్లో పెట్టుకోవాలని, మాకు కేసీఆర్ కావాలె, ఆత్మగౌరవం కావాలన్నారు. ఓటర్లు కారుకు, టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సోనియాగాంధీ రాష్ట్రానికి వచ్చి మొసలికన్నీరు కార్చారని విమర్శించారు. కాంగ్రెస్ గెలుస్తలేదని, కొడుకు రాహుల్‌గాంధీ ప్రధాని కాకపోయే అని కన్నీళ్లు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మనకు కావల్సింది మొసలి కన్నీళ్లా, తాగు నీళ్లా, ఇంటింటికీ మంచి నీళ్లా ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment