సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని రాయలసీమ వాసులు డిసెంబర్ 7న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకే తమ ఓటేసి గెలిపించుకోవాలని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (గ్రాట్) ఆధ్వర్యంలో ‘ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. తెలంగాణలో స్థిరపడిన రాయలసీమ వాసుల నేటి కర్తవ్యం’పేరుతో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలన హైదరాబాద్‌లో నివసిస్తున్న రాయలసీమ ప్రజల అవసరాలు, అభీష్టాలకు పెద్దపీట వేసేలా సాగిందని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాయలసీమ వాసుల పట్ల ఎలాంటి వివక్షా చూపలేదన్నారు. టీఎస్‌ఎస్ సింగిల్ పార్టీ అని, నిర్ణయాలు కూడా కేసీఆర్ వెంటనే తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఒక ఎజెండా ఉంటుందని తెలిపారు. అదే మహాకూటమిలో ఎవరు సీఎం అవుతారో తెలియదన్నారు.
కాంగ్రెస్‌ది అంతా సీల్డ్ కవర్ సంస్కృతి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వారు ఓటుకు కోట్లు కేసులో దొరికిన వారిని సీఎంగా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్‌ఎస్‌కే తమ మద్దతు అని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిపై దృష్టిసారించారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అధికార వికేంద్రీకరణ అంటూ ప్రకటించి ఆచరణలో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. చివరికి హైకోర్టు కూడా అమరావతికి తరలిస్తున్నారని మండిపడ్డారు.
పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇవ్వాలని జీవోలో ఎక్కడా లేదన్నారు. ప్రాజెక్టులను దివంగత సీఎం వైఎస్సార్ పరుగులు పెట్టించారన్నారు. వైఎస్‌ఆర్ మరణంతో ఆగిన గుండెలను పరామర్శించేందుకు వెళ్తానన్న వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. గాలేరు – నగరి ప్రాజెక్టులను చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు కుట్రలో భాగమే మహాకూటమి అని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన టీడీపీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
మహాకూటమి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. మన తీర్పు చంద్రబాబుకు ఒక హెచ్చరికగా ఉండాలని చెప్పారు. గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎ.హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్షనేతకే రక్షణ కల్పించలేని చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటున్న రాయలసీమ వాసులకు అండగా ఉంటానంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఏదిఏమైనా అందరం ఏకమై మహాకూటమి అభ్యర్థులను ఓడిద్దామన్నారు. కార్యక్రమంలో గ్రాట్ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు శ్యామలారెడ్డి, గ్రాట్ అధ్యక్షుడు ఎం ఓబుళరెడ్డి, సభ్యులు బి రాఘవేంద్రరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment