సాక్షి, సిద్దిపేట : ‘గత పాలకులు నలభై సంవత్సరాల్లో చెయ్యని పనిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో చేసింది. అందుకే కాంగ్రెస్ నాయకులు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక తెలంగాణ నుంచి తరిమేసిన చంద్రబాబు నాయుడుతో పొత్తు కలసి కుటిల కూటమిని ఏర్పాటు చేసుకున్నారు’అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ కూటమికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా 5వ తేదీన గజ్వేల్‌లో నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్, దుబ్బాకల్లో జరిగిన రోడ్‌షోల్లో పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా ప్రజలకు ఏది అవసరమో తెలుసుకొని అందించిన ప్రజల మనిషి సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు పథకం రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అందరి మన్ననలను పొందడంతోపాటు ఐక్యరాజ్య సమితి గుర్తించడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. కంటి వెలుగు, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, నిరుపేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు చేరువలోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. అందుకోసమే టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు దీవిస్తున్నారని చెప్పారు.
బీజేపీకి ఓటేస్తే బురద గుంటలో వేసినట్లే
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఒరిగేదేమీ లేదని, వారికి ఓటేస్తే బురద గుంటలో వేసినట్లే అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణలోని ఏడు మండలాలను రాత్రికి రాత్రే ఏపీలో కలిపిన ఘనత బీజేపీ సర్కారుదే అన్నారు. ప్రపంచంలోనే కారు చౌకగా విద్యుత్ ఉత్పత్తి అయ్యే దిగువ సీలేరు విద్యుత్ ప్లాంట్‌ను కూడా ఏపీకి అప్పగించారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన బీజేపీకి, మోదీ ప్రభుత్వానికి తెలంగాణలోని ప్రాజెక్టులు కనిపించలేదని అన్నారు. తెలంగాణలో బీడీ కార్మికులు అధికంగా ఉన్నా వారికి పెన్షన్ ఇచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకు రాలేదని, బీజేపీ పాలిత 17 రాష్ట్రాలలో కూడా బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వడంలేదని చెప్పారు. ఇలాంటి బీజేపీకి ప్రజలు ఓట్లు ఏలా వేస్తారని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ గెలిస్తేనే తెలంగాణ మనుగడ
పరాయి పాలనలో ఛిద్రమైన తెలంగాణ ముఖ చిత్రాన్ని మారుస్తూ సంక్షేమం, అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ సమపాళ్లలో నడుపుతున్నారని హరీశ్ ప్రశంసించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. వీటి ఫలితాలు వస్తే తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారుతుందని పేర్కొన్నారు. నీటి వనరుల్లో మన వాటా మనకు దక్కాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు వివక్షకు గురయ్యారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కరెంట్ కష్టాలు పడుతున్నా మౌనంగా చూసిన బాబు, ఇతర ప్రాంతాల నుంచి కరెంట్ సరఫరాకు కూడా అడ్డుపుల్ల వేశారని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ చతురతతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ తెప్పించుకొని ప్రజలకు కరెంట్ కష్టాల నుండి విముక్తి కలిగించారని అన్నారు. అలాగే సాగునీటికి పరితపించిన తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటే అడుగడుగునా చంద్రబాబు అడ్డుకట్ట వేశారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా కేంద్ర జలవనరుల మండలి వద్ద బాబు ఫిర్యాదులు చేశారన్నారు. అలాంటి చంద్రబాబు భాగస్వామిగా ఉన్నకూటమికి ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై చంద్రబాబు నాయుడుకు ఇంకా మోజు తీరలేదని, ఇక్కడి సంపదను దోచుకో మరిగిన ఆయన తెలంగాణలో మళ్లీ పెత్తనానికి తహతహలాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా హైకోర్టు విభజన కాలేదని, దీనిని బాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వీటితోపాటు విద్యుత్, ఇతర శాఖల్లో ఉద్యోగుల విభజనకు అడ్డుపడుతున్న చంద్రబాబుకు తెలంగాణ ఉద్యోగులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment