
నా బదిలీని ఆపండి
- క్యాట్‌ను ఆశ్రయించిన అంధ ఐఎఫ్‌ఎస్
- అవకతవకలపై నివేదించినందుకే ఇలా జరిగిందంటున్న అధికారవ ర్గాలు
సాక్షి, హైదరాబాద్: తన బదిలీని ఆపాలని కోరుతూ విదేశీ మంత్రిత్వ శాఖలో బ్రాంచ్ సెక్రటేరియట్ అధికారి బుడిగి శ్రీనివాసరెడ్డి...సెంట్రల్ ఆడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో విదేశీ మంత్రిత్వ శాఖకు బ్రాంచ్ సెక్రటేరియట్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయానికి ఏడాది క్రితం ఐఎఫ్‌ఎస్ అధికారి శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఒక అంధుడు ఐఎఫ్‌ఎస్ కావడం దేశంలోనే తొలిసారి. అయితే తాజాగా ఈయనను ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు.
నిబంధనల ప్రకారం సాధారణ బదిలీల్లో భాగంగా వైకల్యమున్న అధికారులను బదిలీ చేయరాదని, ఒకవేళ అలా చేయాల్సివస్తే సదరు అధికారి కోరుకున్న చోటుకే పంపాలని, అయితే తనను ఉన్నఫళంగా ఢిల్లీకి బదిలీ చేశారంటూ శ్రీనివాసరెడ్డి క్యాట్‌ను ఆశ్రయించారు. శ్రీనివాసరెడ్డి బ్రాంచ్ సెక్రటేరియట్‌కు రాకముందు పాస్‌పోర్టు అధికారి ఇన్‌చార్జిగా ఉండేవారు.
ఆ సమయంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ అవకతవకలపై అప్పట్లోనే శ్రీనివాసరెడ్డి విచారణ జరిపి విదేశీమంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. దీంతో కొంతమంది అధికారులు ఉద్దేశ పూర్వకంగానే శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.