ఏసీబీకి లేఖ రాసిన ఎమ్మెల్యే సండ్ర
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణకు వస్తానంటూ లేఖ రాశారు. విచారణకు రావాలన్న ఏసీబీ నోటీసును పెడచెవిన పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సండ్ర.. కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరయ్యాక విచారణకు వస్తానని లేఖ రాయడం గమనార్హం. గురు లేదా శుక్రవారాల్లో సండ్రను విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు.
‘వెన్ను, కుడికాలు నొప్పి కారణంగా రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నాను. చికిత్స కోసం పదిరోజుల సమయం కావాలని 19-06-2015న మిమ్మల్ని కోరిన విషయం విదితమే. కోలుకున్నందున మీరు ఎప్పుడు సమయం ఇచ్చినా అందుబాటులో ఉండి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఏసీబీ ఏఎస్పీ ఎం.మల్లారెడ్డికి సండ్ర లేఖ రాశారు.
తన సెల్ నంబర్‌ను లేఖలో పొందుపరిచారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం విదితమే. వీరిని కస్టడీలోకి తీసుకుని విచారించిన ఏసీబీ కొంత సమాచారం సేకరించింది. నగదు సమీకరణ సహా మరికొన్ని మిస్సింగ్ లింకులు పూరించుకోవడానికి సండ్ర, ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిలను విచారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు గత నెలలో నరేందర్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేసిన సంగతి తెలిసిందే.