బాబే మాస్టర్‌ మైండ్‌.. అంతా ఆ గదిలోనే.. | Vote For Note Case Mattaiah Key Statement Over Chandrababu Role | Sakshi
Sakshi News home page

బాబే మాస్టర్‌ మైండ్‌.. అంతా ఆ గదిలోనే..

Published Fri, Jan 1 2021 1:37 AM | Last Updated on Fri, Jan 1 2021 4:36 PM

Cash For Vote Case Mattaiah Key Statement Over Chandrababu Role - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పాత్ర మరోసారి స్పష్టమైంది. ఈ కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ఇటీవల ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మొత్తం వ్యవహారా నికి మాస్టర్‌మైండ్‌ చంద్రబాబేనని కుండబద్దలుకొట్టాడు. ఈ కుట్ర ఎప్పుడు, ఎలా జరిగింది? తెలంగాణ ప్రభు త్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు మొదలు పెట్టిన ఎమ్మెల్యేల కొను గోలు విషయంలో ఎవరి పాత్ర ఏమిటన్నది పూసగుచ్చినట్లు వివరించాడు. కుట్రకు తెరతీసింది చంద్రబాబు అని, అమలు చేసింది రేవంత్‌రెడ్డి అని, ఇందుకోసం తనకు రూ.50 లక్షలు ఎరవేసి వాడుకున్నారని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

మత్తయ్య ఏమి చెప్పాడంటే..
‘టీడీపీ తెలుగు యువత నాయకుడు జిమ్మీబాబు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. 2015 మే నెలలో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ పాల్గొనే ఓ కార్యక్రమానికి జిమ్మీబాబును ఆహ్వానిద్దామని బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లా. అప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, కొడంగల్‌ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాతో ఏదో రహస్య మంత నాలు జరపాలనుకుంటున్నారని జిమ్మీ నాకు చెప్పాడు. ఇదే విషయమై చంద్రబాబు, రేవంత్‌లతో చర్చించేందుకు హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి రావాలని సూచించాడు. చదవండి: (సీఎం కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం)

జిమ్మీ సూచన మేరకు మర్నాడు హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడుకు వెళ్లా. అక్కడ జిమ్మీబాబు మహానాడు వేదిక వెనుకాల ఉన్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని సూచించారు. తొలుత నేను భయపడ్డా. తప్పని వారించా. కానీ రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమని, పైగా వారు నాకు గుడ్‌విల్‌ కింద రూ. 50 లక్షలు లాభం చేకూరుస్తామని మభ్యపెట్టడంతో సరేనన్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్‌ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే రూ. 5 కోట్లు, ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ. 3 కోట్లు చెల్లిస్తామన్నారు. ముందుగా రూ. 50 లక్షలు అడ్వాన్సుగా మిగిలినది తరువాత అందజేస్తామన్నారు’ అని మత్తయ్య మత్తయ్య ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

ఆ గదిలోనే..
‘‘అప్పుడు.. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు, కొడంగల్‌ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాతో ఏదో రహస్య మంతనాలు జరపాలనుకుంటున్నారని జిమ్మీ చెప్పాడు. ఇదే విషయమై వారితో చర్చించేందుకు నన్ను మహానాడు వేదిక వెనుక ఉన్న గది వద్దకు  తీసుకెళ్లాడు. అక్కడ చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని సూచించారు. రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమని, నాకు గుడ్‌విల్‌ కింద డబ్బులిచ్చి లాభం చేకూరుస్తామని మభ్యపెట్టడంతో సరేనన్నా’’

తొలుత స్టీఫెన్సన్‌ నమ్మలేదు...
‘నేను మర్నాడు స్టీఫెన్స్‌న్‌ ఇంటికి వెళ్లి బోయిగూడలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించా. కార్యక్రమం అనంతరం డీల్‌ గురించి చెబితే తొలుత స్టీఫెన్సన్‌ నమ్మలేదు. రేవంత్‌రెడ్డితో మాట్లాడించాలన్నాడు. లాలాగూడకు చెందిన మాల్కం టేలర్, సీతాఫల్‌మండికి చెందిన ఆంథొనీ ద్వారా స్టీఫెన్సన్‌ను ఒప్పించే ప్రయత్నం చేశా. ఆయన ఒప్పుకోగానే ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి, జిమ్మీబాబులకు టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ ఇన్‌చార్జి హ్యారీ సెబాస్టియన్‌ ద్వారా తెలియజేశా. తరువాత మరోసారి అతనికి ఫోన్‌ చేసినప్పుడు రేవంత్, చంద్రబాబులకు సమాచారం ఇచ్చానని, వారు అదే పనిలో ఉన్నారన్నాడు.

పని పూర్తికాగానే నీకివ్వాల్సింది ఇచ్చేస్తారని సెబాస్టియన్‌ సమాధానమిచ్చాడు. మర్నాడు సెబాస్టియన్‌కు మళ్లీ ఫోన్‌ చేయగా రేవంత్‌రెడ్డి రెండుసార్లు స్టీఫెన్‌సన్‌ని ఆయన నివాసంలో కలిసినట్లు చెప్పాడు. అంతేకాకుండా చంద్రబాబు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో కూడా మాట్లాడాడని చెప్పాడు. దీంతో వెంటనే నేను జిమ్మీబాబుకు కాల్‌ చేసి నా వాటా ఏమైంది? అని అడిగా. ప్రస్తుతం చంద్రబాబు వేం నరేందర్‌రెడ్డి ద్వారా స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు రూ. 50 లక్షలు సిద్ధం చేస్తున్నారని, అది అవగానే నాకు ఏర్పాటు చేస్తామని చెప్పాడు. మర్నాడు రేవంత్‌రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసిందన్న విషయం టీవీల ద్వారా తెలుసుకున్నా.

నన్ను ఏ–4 నిందితుడిగా చూపడంతో రసహ్యంగా జిమ్మీబాబు సాయంతో వెంటనే టీడీపీ ఆఫీసులోకి వెళ్లా. అక్కడ నారా లోకేశ్‌ను కలిశా. నాతో మాట్లాడిన లోకేశ్‌.. ఏమీ భయపడొద్దన్నాడు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను మేనేజ్‌ చేస్తానని అభయమిచ్చాడు. వెంటనే విజయవాడ వెళ్లు, అక్కడ టీడీపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ రక్షణ ఉంటుందని హామీ ఇచ్చాడు’ అని వాంగ్మూలంలో జెరూసలేం మత్తయ్య పేర్కొన్నాడు. 

చంద్రబాబును కలిసిన మాట వాస్తవమే..!
ఈ కేసుకు సంబంధించి జిమ్మీబాబు, మాల్కం టేలర్, ఆంథొనీ, సెబాస్టియన్‌లు తనకు పూర్వ మిత్రులని, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను పలు పనులపై కలిశానని మత్తయ్య చెప్పుకొచ్చాడు. అలాగే పలు అధికారిక కార్యక్రమాలతోపాటు ఓటుకు నోటు కుట్ర విషయంలోనూ 2015 మే నెలాఖరులో చంద్రబాబును తాను కలిసిన మాట నిజమేనని అంగీకరించాడు. ఈ కేసు విషయంలో మొదటి నుంచి చంద్రబాబుపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. స్టీఫెన్సన్‌ ఇంట్లో రేవంత్‌రెడ్డి ఆయనకు రూ. 50 లక్షలిస్తూ మభ్యపెడుతుండగా ఆడియో వీడియోలతో సహా ఏసీబీ రికార్డు చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కేసులో ఇప్పటికే రేవంత్, వేం నరేందర్‌రెడ్డి, జెరూసలేం మత్తయ్యను విచారించిన ఈడీ... చంద్రబాబు చుట్టూ ఉచ్చుబిగించే ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారప్రీ కుట్రకు సూత్రధారి చంద్రబాబే అని మొదటి నుంచి వస్తున్న ఆరోపణలకు మత్తయ్య వాంగ్మూలంతో మరింత బలం చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలో ఈడీ ఎలా ముందుకు వెళ్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement