ఐఏఎస్ కేటాయింపుల్లో మార్పులు
ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మారనున్న రోస్టర్
ఈనెల 18 లోపు ప్రత్యూష్ సిన్హా తుది సమావేశం
నెలాఖరులోగా పంపిణీ పూర్తి
హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల పంపకాలు ఈ నెలాఖరులోగా పూర్తి కానున్నాయి. ప్రత్యూష్‌సిన్హా కమిటీ ఈనెల 18 లోపు సమావేశమై ఇదివరకు జరిపిన తాత్కాలిక కేటాయింపుల్లో జరిగిన లోపాలను సవరించి, తుది జాబితాను కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు(డీవోపీటీ) పంపించనుంది. ఐఎఫ్‌ఎస్ కేడర్ అధికారుల జాబితాను అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ.. ఐపీఎస్‌లది హోం శాఖ, ఐఏఎస్‌ల జాబితాను డీవోపీటీపరిశీలించనుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత తాత్కాలిక కేటాయింపుల్లో ఐఏఎస్‌లు జేఆర్ ఆనంద్, రాణి కుముదినిలను ఇన్‌సైడర్ (రాష్ట్రానికి చెందినవాళ్లు) కేటగిరీలో చేర్చారు. వాస్తవంగా రాణి కుముదినీని జమ్ము-కాశ్మీర్ కేడర్‌కు కేటాయించారు. ఆమె ఆనారోగ్య కారణాలతో బదిలీపై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చారు. దీంతో ముందు కేటాయించిన కేడర్‌నే ఆమెకు వర్తింపచేయనున్నారు. దీనితో ఇన్‌సైడర్‌గా ఉన్న రాణికుముదిని ఔట్‌సైడర్(రాష్ట్రేతరులు)గా పరిగణించడంతో... ఎస్సీ ఐఏఎస్ కేడర్‌లో రోస్టర్ బాండ్ విధానం మారిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కేటాయించిన డాక్టర్ పీవీ రమేశ్ ఆంధ్రాకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే జేఆర్ ఆనంద్‌ను ఇన్‌సైడర్‌గా గుర్తించారు.
వాస్తవంగా ఆయన ఒడిశాకు చెందిన వ్యక్తి. కానీ ఆయన్ను ఆంధ్రా ఇన్‌సైడర్‌గా భావించి కేటాయించారు. ఇప్పుడు వీరిద్దరినీ రాష్ట్రేతరులుగా పరిగణించాల్సి రావడం వల్ల.. ఎస్సీ, ఎస్టీ కేడర్ అధికారుల రోస్టర్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని ఉన్నతాధికార వర్గాలు వివరించాయి. అలాగే ఆంధ్రాకు కేటాయించిన బీఆర్ మీనా తెలంగాణకు వచ్చే అవకాశముంది. అలాగే ఓబీసీ కేటగిరీలో శ్యామలరావును ముందు ఒడిశా రాష్ట్రానికి కేటాయించారు. ఆయన అంత ర్రాష్ట బదిలీతో రాష్ట్రానికి వ చ్చారని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన కేడర్ కేటాయింపులోనే తప్పు జరిగిందని, కోర్టు నుంచి శ్యామలరావు ఉత్తర్వులు తెచ్చుకున్నం దున ఆయనను ఆంధ్రా కేడర్ ఇన్‌సైడర్‌గానే గుర్తిం చనున్నారు. కాగా ఆంధ్రా నుంచి డెరైక్టర్ రిక్రూటీలు ఎక్కువగా ఉన్నందున.. తెలంగాణకు కొందరు పనిచేయక తప్పదని ఓ అధికారి తెలిపారు.
భార్యాభర్తల విషయంలో..: భార్యాభర్తల విషయంలో పాత నిబంధనలు ఇక్కడ వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు ఒకేచోట పనిచేయడానికి అవకాశం ఉందని ఆ వర్గాలు వివరించాయి. డీవోపీటీ కేటాయింపులు చేసే సమయంలో వీటిని సరిచేసే అవకాశం ఉందని అంటున్నారు. భార్యాభర్తలైన అధికారులు కలసి పనిచేయాలని కోరినా.. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయాలని కోరినా అందుకు అంగీకరిస్తారని ఓ ఉన్నతాధికారి వివరించారు