డీజీపీ రేసులో ఆరుగురు | Six officers to ready for race of DGP post | Sakshi
Sakshi News home page

డీజీపీ రేసులో ఆరుగురు

Published Thu, Feb 26 2015 9:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

డీజీపీ రేసులో ఆరుగురు

డీజీపీ రేసులో ఆరుగురు

* పూర్తిస్థాయి డీజీపీ నియామకం అనివార్యం
* కొత్త బాస్ ఎవరంటూ పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ
* యూపీఎస్సీకి జాబితా పంపనున్న సర్కారు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగానికి పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై ప్రభుత్వం దృష్టిసారించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజన కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయి డీజీపీ నియామకం అనివార్యమైం ది. ఇందుకు అర్హులైన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. డీజీపీ నియామక నియమావళిని అనుసరించి ఐదు లేదా ఆరుగురు అ ధికారుల పేర్లను సిఫారసు చేస్తూ యూపీఎస్సీ కి రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపనుంది. సీని యారిటీ ప్రాతిపదికన ఈ జాబితాలో అరుణా బహుగుణ, టి.పి.దాస్, ఎస్.ఎ.హుడా, దుర్గాప్రసాద్, ఎ.కె.ఖాన్, అనురాగ్ శర్మ పేర్లుండే అవకాశాలున్నాయి. జాబితాతో పాటు ఆయా అధికారుల సీనియారిటీ, మెరిట్, అనుభవం, నిర్వహించిన పోస్టులు, సాధించిన పతకాలు, సమర్థత, ఎదుర్కొన్న వివాదాలు, మిగిలున్న సర్వీసు కాలం తదితరాలతో కూడిన సమగ్ర నివేదికను యూపీఎస్సీ సెలక్షన్ కమిటీకి ప్రభుత్వం పంపుతుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జాబితా నుంచి ముగ్గురు అధికారుల పేర్లను యూపీఎస్సీ కమిటీ ఎంపిక చేసి రాష్ట్రానికి పంపుతుంది. ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఆ ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించనుంది. యూపీఎస్సీ సిఫార్సు చేయనున్న ముగ్గురు అధికారుల్లో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేయవచ్చనే దానిపై రాష్ట్ర పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. డీజీపీల నియామకాల్లో సీనియారిటీ, ఇతర నిబంధనలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కావాల్సిన వారినే నియమిస్తుండడంతో దీనిపై ప్రతిసారీ న్యాయవివాదాలు తలెత్తుతున్నాయి.
 
విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాత్కాలిక డీజీపీల నియామకానికి మాత్రమే కేంద్రం అనుమతించడం తెలిసిందే. దాంతో తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా 1982 బ్యాచ్ అధికారి అనురాగ్ శర్మను ప్రభుత్వం నియమించింది. అప్పటికి ఆయన కంటే సీనియర్ అధికారులు పలువురున్నారు. వారిలో కొంద రు శర్మ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికీ దిగారు. ఈ నేపథ్యంలో శర్మనే పూర్తిస్థాయి డీజీపీగా నిమిస్తా రా, లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. 1979 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అధికారుల్లో అరుణా బహుగుణ డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ డెరైక్టర్‌గా కీలక బాధ్యతల్లో ఉన్న ఆమె డీజీపీ పోస్టు కో సం రాష్ట్ర సర్వీసుకు తిరిగి రావాలంటే ఆ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉం టుంది. అదే బ్యాచ్‌కు చెందిన ఎస్.ఎ.హుడా, టి.పి.దాస్ గతంలో డీజీపీల నియామకాలను సవాలు చేస్తూ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. దాస్ ఈ నవంబర్‌లో పదవి విరమణ చేయనున్నారు. ఇక 1981 బ్యాచ్ అధికారుల్లో దుర్గాప్రసాద్ ఏపీ కేడర్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండగా ఏకే ఖాన్ ఏసీబీ డీజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement