సాక్షి, హైదరాబాద్: డీజీపీ నియామక అధికారం రాష్ట్ర పరిధిలో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తోంది. డీజీపీ నియామకంపై కేంద్రానికున్న అధికారాన్ని సవరిస్తూ ‘హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్సెస్ యాక్ట్–2018’ బిల్లును రూపొందిస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుకు గతవారమే సాధారణ పరిపాలన శాఖ అనుమతివ్వగా న్యాయశాఖ తుది మెరుగులు దిద్దుతోంది. 8న జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో బిల్లు ముసాయిదాపై చర్చించి ఆమోదించే అవకాశ ముంది.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జేవీ రాముడు డీజీపీగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఇదే చట్టం చేసింది. ఆ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకురానుంది. ప్రస్తుత విధానం ప్రకా రం డీజీపీని నియమించాలంటే డీజీపీ హోదా గల ఐపీఎస్ అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్‌సీకి పంపిస్తుంది. అందులో ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్సీ, డీవోపీటీ రాష్ట్రానికి తిరిగి పంపుతాయి. అందులో ఒకరిని సీఎం విచక్షణాధికారం మేరకు డీజీపీగా నియమిస్తారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే యూపీఎస్సీ, కేంద్రంతో సంబంధం లేకుండా డీజీపీ హోదాగల ఐపీఎస్ అధికారుల్లో సీనియారిటీ ప్రకారం ముఖ్యమంత్రే నియమించవచ్చు.
రేపు కేబినెట్ భేటీ
4 నెలల సుదీర్ఘ సమయం తర్వాత రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 12 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల వ్యూహంపై చర్చించనున్నారు. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే పలు కీలక బిల్లులను ఆమోదించనుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్ట సవరణ, ఉర్దూ పోస్టుల నియామకాలకు సవరణల చట్టం సవరణ బిల్లులను భేటీలో చర్చించనున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ పోలీస్ ఫోర్సెస్ యాక్ట్, భూముల రీ అసైన్‌మెంట్‌కు చట్ట సవరణ, వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ స్థాయి వరకు తెలుగును తప్పనిసరి చేసే బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment