* ఒకే ప్రాంగణంలో అందరికీ నివాసం
* తెలంగాణ సర్కార్ నిర్ణయం
* 75 డూప్లెక్స్ విల్లాలు
* సీఎస్ నుంచి కార్యదర్శుల వరకు ఇక్కడే క్వార్టర్లు
* గచ్చిబౌలిలో డీజీపీ, సీఎస్, సీపీలకు క్యాంపు ఆఫీసులు
* ప్రభుత్వ ఉత్సవాల నిర్వహణకు శివార్లలో ప్రత్యేక మైదానం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఐఏఎస్ అధికారులందరికీ ఒకే ప్రాంగణంలో నివాసం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో వారికి క్వార్టర్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు కార్యదర్శి స్థాయి అధికారి వరకు ఇక్కడే క్వార్టర్లు ఉంటాయి. హైదరాబాద్‌లోని పంజగుట్ట, ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. త్వరలోనే రోడ్లు, భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖ వాటిని పూర్తిగా తొలగించనుంది.
ఎర్రమంజిల్, పంజగుట్ట మీదుగా మెట్రోరైలును ప్రవేశ పెడుతుండడంతో.. ఈ ప్రాంతంలో మెట్రో స్టేషన్ కోసం ప్రభుత్వం ఐదెకరాలను సేకరించింది. అలాగే నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్) విస్తరణలో భాగంగా దాదాపు 20 ఎకరాలను తీసుకుంది. దీంతో ఇక్కడ ఉన్న ఐఏఎస్ క్వార్టర్ల తొలగింపు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో రాయదుర్గంలోని సర్వే నం.83లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇదివరకూ అక్కడ టీఐసీసీకి కేటాయించిన 25 ఎకరాల విస్తీర్ణంలో ఐఏఎస్ నివాస ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇక్కడ అన్ని ఆధునిక సదుపాయాలతో 75 డూప్లెక్స్ విల్లాలు నిర్మించేలా ఆర్‌అండ్‌బీ ప్రణాళికలు రచిస్తోంది. అటు అత్యున్నతస్థాయి అధికారులకు క్యాంపు ఆఫీసులను ఏర్పాటు చేసేందుకూ చర్యలు మొదలుపెట్టారు. ప్రస్తుతం కుందన్‌బాగ్‌లో నివసిస్తున్న సీఎస్, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌లకు ఎలాంటి క్యాంపు కార్యాలయాల్లేవు. దీంతో గచ్చిబౌలిలో 15 ఎకరాల విస్తీర్ణంలో సీఎస్, డీజీపీ, సిటీ సీపీ క్యాంపు ఆఫీసులను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
పరేడ్ గ్రౌండ్‌కు కూడా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అయితే, భవిష్యత్తులో గోల్కొండ కోటలో ప్రభుత్వపరమైన వేడుకలు నిర్వహించే విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు ఆర్మీ అధికారులు అడ్డు తగలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పరేడ్ గ్రౌండ్ నిమిత్తం శివారు ప్రాంతంలో 45-50 ఎకరాలను గుర్తించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, సరూర్‌నగ ర్ మండలాల్లో ప్రభుత్వ భూవ ుులను అన్వేషించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఒకట్రెండు రోజుల్లో గుర్తించిన స్థలాల జాబితాను ప్రభుత్వానికి పంపాలని అధికారులు నిర్ణయించారు.
ఐఏఎస్‌లు @ రాయదుర్గం
Published Thu, Sep 11 2014 1:16 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM
Advertisement
Advertisement