మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి రాములు
సాక్షి,నాగర్‌కర్నూల్: పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు పెద్ద జీతగాడిలా పనిచేసి రుణం తీర్చుకుంటానని ఎంపీ అభ్యర్థి రాములు అన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.హౌసింగ్ బోర్డు నుంచి బస్టాండ్ కూడలి వరకు బైక్ ర్యాలీ తీసిన అనంతరం అక్కడే కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రెండు రోజులు కార్యకర్తలు పనిచేస్తే ఐదేళ్లు కందనూలు అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానన్నారు. ఎంపీ నిధుల్లో సింహభాగం నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికే కేటాయిస్తామని, గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానన్నారు.
1996 నుంచి అచ్చంపేట ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేలపై జీవించిన నేను.. ఈ నేల ప్రజలకే సేవ చేసి తనువు చాలిస్తానన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిచి సీఎంకు బహుమతిగా ఇస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి అభివృద్ధి కోసం అత్యధిక నిధులు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌కు సంబంధించిన రైతులు గతంలో హైదరాబాద్‌లో అడ్డా కూలీలుగా ఉన్నారని, కేఎల్‌ఐ నీటి రాకతో తిరిగి కొన్ని ప్రాంతాలకు చేరుకుని వ్యవసాయం చేస్తున్నారన్నారు.
తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సస్యశ్యామలం చేసినందుకే రెండోసారి సీఎం అయ్యారన్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కేసీఆర్ ప్రధాని అవుతారన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా వలస వచ్చిన వారేనని, ప్రస్తుతం స్థానికుడికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజా సమస్యలు తీర్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌యాదవ్, రఘునందన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment