గద్వాలలో ఐఐహెచ్‌టీ కాలేజీ
♦ ముందస్తుగా చేనేత ఐటీఐకి అనుమతి
♦ కేంద్రానికి పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులు అధికంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాను చేనేత పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దాలని పరిశ్రమల శాఖ పరిధిలోని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం యోచిస్తోంది. జిల్లాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) కాలేజీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 ఐఐహెచ్‌టీ కాలేజీలు ఉండగా, వీటిలో కేంద్రం పరిధిలో ఆరు, రాష్ట్రాల పరిధిలో నాలుగు కాలేజీలు నడుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రగడ కోటయ్య ఐఐహెచ్‌టీని స్థాపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికంగా చేనేత రంగానికున్న ప్రాముఖ్యతను వివరిస్తూ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు సమర్పించింది.
ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. తొలుత డిప్లొమా కోర్సులు ప్రారంభించేందుకు వీలుగా చేనేత ఐటీఐ కాలేజీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా చేనేత ఐటీఐ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు కేంద్రానికి పంపారు. తొలి దశలో ఐఐటీలో డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టి.. పూర్తి స్థాయిలో కాలేజీ ఏర్పాటు చేసిన తర్వాత పోస్టు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తున్నారు. చేనేత ఐఐటీ, ఐఐహెచ్‌టీ ఏర్పాటుతో చేనేత, వస్త్ర పరిశ్రమ రంగంలో వస్తున్న ఆధునాతన సాంకేతిక అంశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి సాధ్యపడుతుందని అధికారులు చెబుతున్నారు.
మెగా క్లస్టర్‌పైనా కసరత్తు
జాతీయ చేనేత అభివృద్ధి పథకం (ఎన్‌హెచ్‌డీపీ) కింద మహబూబ్‌నగర్ జిల్లాలో మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. గద్వాల లో 2006-07లో 50 ఎకరాల్లో రూ.8.21 కోట్లతో చేనేత పార్కు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినా, ప్రాథమిక స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి. దీంతో తాజాగా రూ.70 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నివేదికను రూపొందిస్తున్నారు.