
సాక్షి, సంగారెడ్డి: కేన్సర్ మహమ్మారిని నిర్మూలించేందుకు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు చేసిన పరిశోధనల్లో ముందడుగు పడింది. కేన్సర్ చికిత్స కోసం సమర్థవంతమైన కాంబినేషన్ థెరపీని అభివృద్ధి చేశారు. కేన్సర్‌కు ఎలాంటి మందులు లేకపోవడంతో చికిత్స ద్వారానే నిర్మూలించేందుకు తాము మెరుగైన చికి త్స కోణంలో పరిశోధనలు జరిపిన ట్లు ఐఐటీ హైదరాబాద్ బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్‌కుమార్ రెంగన్ తెలిపారు.
యాంటీ కేన్సర్ ఏజెంట్‌ను ఉపయోగించి ఫొటోథర్మల్ థెరపీ (పీటీటీ), కీమోథెరపీ సినర్జెటిక్ కలయికను గుర్తించినట్లు వివరించారు. పరిశోధన వివరాలతో మంగళవారం ఐఐటీ హెచ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కాంబినేషన్ థెరపీపై ఐఐటీ బాంబే, కోల్‌కతా బోస్ విశ్వవిద్యాలయం సహకారంతో పరిశోధనలు నిర్వహించినట్లు డాక్టర్ అరవింద్‌కుమార్ రెంగన్ పేర్కొన్నారు.
హోస్ట్ కణాలను నాశనం చేస్తారిలా..
ఫొటోథర్మల్ థెరపీలో కాంతిని వేడిగా మార్చే పదార్థం కణతి (గడ్డ) ఉన్న ప్రాంతానికే నేరుగా వెళ్తుందని.. తద్వారా హోస్ట్ కేన్సర్ కణాలను తొలగించడం, నాశనం చేయడం చాలా సులువవుతుందని అరవింద్‌కుమార్ రెంగన్ తెలిపారు. ఐఆర్ 780 ఇన్ఫ్రారెడ్ కాంతిని గ్రహించడంతో పాటు కణతి వద్ద ఉండే కేన్సర్ కణాలను చంపేస్తుందని పేర్కొన్నారు. ఐఆర్ 780 హోస్ట్ కేన్సర్ కణాలను నశింపజేసే ఆక్సిజన్ జాతులను ఉత్పత్తి చేస్తుందని పరిశోధన ద్వారా తెలుసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment